హైదరాబాద్, వెలుగు: కేసును నిరూపించడంలో భాగంగా సాక్షి విచారణ పూర్తయినప్పటికీ, అవసరమైతే మరోసారి కోర్టుకు పిలిపించి విచారించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకసారి సాక్ష్యం నమోదు చేశాక సాక్షిని తిరిగి పిలిపించరాదన్న నిందితుడి అభ్యర్థనను తోసిపుచ్చింది.
ఏసీబీ నమోదు చేసిన ఒక కేసులో విచారణ పూర్తయిన మొదటి సాక్షిని తిరిగి విచారించాలన్న ప్రాసిక్యూషన్ అభ్యర్థనను ఏసీబీ కోర్టు అనుమతించడాన్ని సవాలు చేస్తూ అప్పటి డిచ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ డి. బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ జె. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సీఆర్‌పీసీ సెక్షన్ 311 కింద క్రిమినల్ కోర్టులకు విస్తృత అధికారాలున్నాయని తెలిపారు. సరైన న్యాయం జరగడానికి ఒక సాక్షి కీలకం అనుకున్నప్పుడు, కేసు ఏ దశలో ఉన్నా తిరిగి విచారణ చేపట్టవచ్చని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు తీర్పును సమర్థిస్తూ, కింది కోర్టు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సాక్షిని తిరిగి విచారించాలని ఆదేశించారు. ఈ విచారణ ప్రక్రియను ఎలాంటి వాయిదాలు కోరకుండా నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని కింది కోర్టుకు స్పష్టం చేశారు.
