ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు
  • నాగోల్‌‌, మేడ్చల్‌‌, కొండాపూర్‌‌‌‌లో రెయిడ్స్‌‌.. పరుగు తీసిన ఏజెంట్లు
  • నాగోల్‌‌లో15 మంది ఏజెంట్ల వద్ద రూ.41 వేలు పట్టివేత
  • ఏజెంట్లు, అధికారుల లావాదేవీలు సేకరిస్తున్న ఏసీబీ
  • ఆన్‌‌లైన్ ట్రాన్సాక్షన్‌‌లో అవకతవకలు గుర్తించిన అధికారులు
  • వెహికల్ నంబర్లు కోడ్‌‌గా డ్రైవింగ్ స్కూల్స్‌‌ లంచాలు
  • డిస్పాచ్‌‌ చేయని 150 కార్డులు స్వాధీనం 

హైదరాబాద్‌‌, వెలుగు:  ఆర్టీఏ ఆఫీసుల్లో  అవినీతి దందాపై ఏసీబీ నజర్ పెట్టింది. రవాణా శాఖ అధికారుల అవినీతితోపాటు ఏజెంట్లు, బ్రోకర్లను కట్టడి చేయడంలో భాగంగా బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్‌‌ పరిసర ప్రాంతాల్లోని నాగోల్‌‌, కొండాపూర్‌‌‌‌, మేడ్చల్‌‌జిల్లా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ముగ్గురు డీఎస్పీల ఆధ్వర్యంలో దాదాపు 30 మంది ఏసీబీ అధికారులు సోదాల్లో పాల్గొన్నారు.‌‌‌‌ స్థానిక మోటార్ వెహికల్ ఇన్‌‌స్పెక్టర్లు, ఆఫీస్ సూపరింటెండెంట్లు, ఔట్‌‌సోర్సింగ్‌‌సిబ్బందిని విచారించారు.

ప్రధానంగా వాహనదారుల నుంచి  ప్రతిరోజు వస్తున్న అప్లికేషన్ల సంఖ్య, అప్రూవల్‌‌, పెండింగ్‌‌ ఫైల్స్‌‌ను పరిశీలించారు. డ్రైవింగ్ లైసెన్సులు, వెహికల్ రిజిస్ట్రేషన్‌‌, స్కూల్ బస్సుల ఫిట్‌‌నెస్‌‌లకు సంబంధించిన పెండింగ్ ఫైల్స్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవింగ్‌‌ లైసెన్స్ సహా వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో  ఏజెంట్లు, బ్రోకర్ల  ప్రమేయంపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఏజెంట్ల కోడ్స్‌‌తో సిఫార్సు ఉంటేనే ఆర్టీఏ అధికారులు అప్లికేషన్లను యాక్సెప్ట్ చేస్తున్నట్టు గుర్తించారు. 

నాగోల్‌‌లో 15 మంది ఏజెంట్ల పట్టివేత

నాగోల్‌‌లో ప్రైవేట్‌‌ ఏజెంట్లు, ఆర్టీఏ అధికారుల మధ్య లావాదేవీలను ఏసీబీ గుర్తించింది. ఏడుగురు డ్రైవింగ్ స్కూల్ యజమానులు (ఏజెంట్లు), 8 మంది డ్రైవింగ్‌‌ ట్రైనర్లను ఏసీబీ  అధికారులు పట్టుకున్నారు. వీరి వద్ద  మొత్తం రూ.41 వేలు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవింగ్ స్కూళ్ల యాజమాన్యం నుంచి లంచాలు వసూలు చేయడానికి వెహికల్‌‌ నంబర్లను కోడ్‌‌గా ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. డ్రైవింగ్ ట్రాక్‌‌పై ఇలాంటి 11 కార్లను స్వాధీనం చేసుకున్నారు.

 కాగా, ఏసీబీ అధికారులు వచ్చే సమయంలో కొంత మంది ఏజెంట్లు అక్కడి నుంచి పారిపోయారు. డిస్పాచ్ సెక్షన్ సిబ్బంది, రిజిస్టర్డ్, స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తుదారుల చిరునామాలకు డ్రైవింగ్ లైసెన్సులను పంపకుండా, వాటిని నేరుగా ఏజెంట్లకు అందజేస్తున్నట్టు ఏసీబీ దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ మేరకు అడ్మినిస్ట్రేషన్  సిబ్బంది అవినీతికి పాల్పడినట్టు ఏసీబీ ఆధారాలు సేకరించింది.

డ్రైవింగ్ స్కూల్ యజమానిగా అక్కడకు వచ్చిన ఏజెంట్‌‌ సుధాకర్‌‌‌‌రెడ్డి వద్ద మొత్తం 184 డ్రైవింగ్ లైసెన్సులు లభించాయి. వీటితోపాటు డ్రైవింగ్ ట్రాక్‌‌లో డ్రైవింగ్ స్కూల్ ట్రైనర్లను అనుమతిస్తున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.  డ్రైవింగ్‌‌ లైసెన్స్‌‌లను తిరస్కరించకుండా ఏజెంట్ల సహకారంతో ఒక్క రోజే మొత్తం 185 అప్లికేషన్లకు అప్రూవల్‌‌ ఇచ్చినట్టు ఏసీబీ సోదాల్లో బయటపడింది. 

కార్డులు డిస్పాచ్‌‌ చేయకుండా ఏజెంట్ల చేతికి

కొండాపూర్‌‌‌‌ ఆర్టీఏలో వాహనదారులకు డిస్పాచ్‌‌ చేయని డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్‌‌‌‌సీ బుక్స్‌‌ను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏజెంట్ల వద్ద  డ్రైవింగ్‌‌ లైసెన్స్‌‌లు, ఆర్‌‌‌‌సీలు కలిపి మొత్తం 150 కార్డ్స్‌‌ స్వాధీనం చేసుకున్నారు. డ్రైవింగ్ టెస్ట్‌‌ ట్రాక్‌‌ వద్ద ప్రైవేట్ వ్యక్తులు, ఏజెంట్ల వాహనదారుల లిస్టులతో ఉండడం గుర్తించారు. మేడ్చల్‌‌ ఆర్టీఏ ఆఫీస్‌‌లో అప్లికేషన్లపై ఏజెంట్ల పేర్లు, కోడ్‌‌లు ఉన్నట్టు తేలింది. డ్రైవింగ్‌‌ టెస్ట్‌‌ ట్రాక్‌‌పై ఓ ప్రైవేట్‌‌ వ్యక్తి వద్ద 4  డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్లను స్వాధీనం చేసుకున్నారు.

దరఖాస్తుదారులు స్వయంగా హాజరుకాకుండానే డ్రైవింగ్ స్కూల్‌‌ నిర్వాహకులు లైసెన్స్‌‌లు మంజూరు చేస్తున్నట్టు గుర్తించారు. ఇందుకుగాను లైసెన్స్ (ఎల్‌‌ఎల్‌‌ఆర్‌‌‌‌) జారీ చేసేందుకు భారీ మొత్తంలో వసూలు చేస్తున్నట్టు ఏసీబీ తనిఖీల్లో వెల్లడైంది. ఏజెంట్లు సిఫార్సు లేని అప్లికేషన్లు పెండింగ్‌‌ రిజెక్ట్ చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఏజెంట్లదే హవా 

లర్నింగ్ లైసెన్స్‌‌తో పాటు వాహనానికి సంబంధించిన ఫిట్‌‌నెస్‌‌ సర్టిఫికెట్, వాహన ఓనర్‌‌‌‌షిప్‌‌ ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ సర్టిఫికెట్‌‌లాంటి అంశాలపైనా ఏసీబీ అధికారులు ఆరా తీశారు. అధికారులు, ఏజెంట్ల ఫోన్‌‌ నంబర్ల ఆధారంగా ఆన్‌‌లైన్ ట్రాన్సాక్షన్లను గుర్తించారు. ఈ మేరకు పలు అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు లభించాయి. ఆన్‌‌లైన్ ద్వారా చెల్లించిన అసలు ఫీజు కాకుండా అదనపు మొత్తాలను వసూలు చేసినట్టు ఏసీబీ తనిఖీల్లో వెలుగు చూసింది.

ఇలా చెల్లింపులు జరిగిన తర్వాత ఆర్సీ, డ్రైవింగ్‌‌ లైసెన్సులు ఏజెంట్లకు చేరుతున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ విభాగం, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ గదులు, అధికారిక కంప్యూటర్లు ఆపరేట్‌‌ చేసే ప్రాంతాల్లో ఏజెంట్లు, ప్రైవేట్‌‌ వ్యక్తులకు అనుమతి ఇస్తుస్తున్నట్టు ఏసీబీ గుర్తించింది. ఈ క్రమంలో మధ్యవర్తుల ద్వారా ఆర్టీఏ అధికారులకు పెద్ద మొత్తంలో లంచాలు అందుతున్నట్టు తేల్చింది.