- ఏ1 కేటీఆర్ సహా ఐదుగురు నిందితులకు సమన్లు
- జులై 31న విచారణకు హాజరుకావాలని ఆదేశం
- హెచ్‌ఎండీఏ నిధుల దుర్వినియోగంపై కీలక ఆధారాలు అందించిన ఏసీబీ
- క్విడ్ ప్రోకో ద్వారా బీఆర్‌ఎస్‌కు రూ.44 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు వచ్చాయని అభియోగం
- దాదాపు వెయ్యికి పైగా డాక్యుమెంట్లను అందించిన ఏసీబీ
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏ2 మాజీ ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ3 హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి, ఏ4 స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఏ5 యూకేకు చెందిన ఎఫ్‌ఈఓలకు గురువారం ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. జులై 31న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. హెచ్‌ఎండీఏ బోర్డుకు చెందిన రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు మళ్లించడంతోపాటు క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లు పేర్కొంటూ మార్చి 23న ఏసీబీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది.
నిందితులు, సాక్షుల వాంగ్మూలాలతో హెచ్‌ఎండీఏ బోర్డుల నిధుల దుర్వినియోగానికి సంబంధించి దాదాపు వెయ్యికిపైగా డాక్యుమెంట్లు కోర్టుకు అందించింది. ఫార్ములా ఈ కార్ -రేసింగ్ వల్ల హెచ్ఎండీఏకు ఎలాంటి లాభం లేకపోగా.. రూ.75.88 కోట్ల నష్టం వాటిల్లినట్లు గుర్తించింది. ఈ మొత్తం వ్యవహారంలో గ్రీన్ కో సంస్థ నుంచి క్విడ్ ప్రోకో రూపంలో బీఆర్‌ఎస్‌కు రూ.44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు అందినట్లు ఆధారాలు సేకరించింది.
వీటికి సంబంధించిన పూర్తి సాంకేతిక ఆధారాలను కోర్టుకు అందించింది. ఛార్జ్‌షీట్ పరిశీలన అనంతరం.. నిందితులపై ఏసీబీ మోపిన అభియోగాలను కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ మేరకు విచారణకు స్వీకరిస్తూ సమన్లు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు జూలై 31న జరిగే మొట్టమొదటి హియరింగ్‌కు నిందితులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. పూచికత్తులు సమర్పించిన అనంతరం తదుపరి ప్రాసిక్యూషన్ విచారణ ఎదుర్కోవాలి.
ఎంఏయూడీతో ఒప్పందం.. హెచ్ఎండీఏతో ఖర్చు
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హుస్సేన్ సాగర్ వద్ద ఫార్ములా ఈ కార్ రేస్ పోటీలు నిర్వహించేందుకు 2022 అక్టోబర్ 25న ఎంఏయూడీ, బ్రిటన్‌కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్(ఎఫ్‌ఈవో), గ్రీన్ కో అనుబంధ సంస్థ ఏస్ నెక్స్ట్ జెన్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగిం ది. ఈ ఒప్పందం ప్రకారం హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఈ కార్ రేసింగ్ సీజన్ 9,10,11,12 నిర్వహించాలని షెడ్యూల్ చేశారు.
ఇందుకు గాను ట్రాక్ నిర్మాణం, ఇతర ఏర్పాట్ల కోసం ఎంఏయూడీతో ఒప్పందం చేసుకొని హెచ్‌ఎండీఏ నిధులు ఖర్చు చేశారు. 2023 ఫిబ్రవరి 11న సీజన్ 9 నిర్వహించారు. ఆర్థికపరమైన అంశాలతో ఏస్ నెక్ట్స్ జెన్, ఫార్ములా ఈ ఆపరేషన్స్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఫార్ములా ఈ ఆపరేషన్స్‌కు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోవడంతో ఆ సంస్థ కార్ రేస్ నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందించింది.
నిధుల మళ్లింపు ఇలా..
ఏస్ నెక్ట్స్ జెన్ తప్పుకోవడంతో సీజన్ 10,11,12 నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అర్వింద్‌కుమార్ నేతృత్వంలో ఎఫ్‌ఈవో, ఎంఏయూడీ మధ్య 2023 అక్టోబర్ 30న మరో కొత్త ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో ఈవెంట్ నిర్వహణ కోసం స్పాన్సర్ ఫీజు, ట్యాక్స్‌లు కలిపి మొత్తం రూ.110 కోట్లు (గ్రేట్ బ్రిటన్ పౌండ్ 90,00,000) చెల్లించే విధంగా అగ్రిమెంట్‌లో పేర్కొన్నారు.
ఈ మేరకు ఈవెంట్ నిర్వహణ కోసం మున్సిపల్ సర్వీసెస్, సివిల్ వర్క్స్ కోసం మరో రూ.50 కోట్లు ఖర్చు చేసే లా అండర్ టేకింగ్ తీసుకున్నారు. వీటితో పాటు మూడు సీజన్ల కోసం హెచ్‌ఎండీఏ బోర్డు నుంచి రూ.160 కోట్ల చెల్లించేలా అప్రూవల్ పొందారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం సీజన్ 10 నిర్వహణ కోసం హెచ్‌ఎండీఏ బోర్డుకు చెందిన సాధారణ నిధులు వినియోగించారు.
8.07 కోట్లు ఐటీ ఫైన్ సహా రూ.54.88 కోట్లు
ఈ కార్ రేసింగ్ సీజన్ 10 నిర్వహణలో భాగంగా 2023 అక్టోబర్ 3,11 వ తేదీల్లో లండన్‌లోని ఎఫ్‌ఈవో అకౌంట్‌కు హెచ్‌ఎండీఏ నిధుల నుంచి రెండు విడతలుగా రూ.45 కోట్ల 71లక్షల 60 వేల 625 తరలించారు. కాగా, ఆ సమయంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. ఈ క్రమంలోనే ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు డబ్బు తరలించినందుకు గాను హెచ్‌ఎండీఏ బోర్డుకు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ రూ.8.07 కోట్లు ఐటీ జరిమానా విధించింది.
దీంతో మొత్తంగా హెచ్‌ఎండీ బోర్డుకు చెందిన సాధారణ నిధుల నుంచి రూ.54 కోట్ల88 లక్షల 87 వేల 043 చెల్లించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. హెచ్‌ఎండీఏ నిధుల దుర్వియోగంపై ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ దానకిషోర్ 2024 డిసెంబర్ 18న ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మరుసటి రోజే డిసెంబర్ 19న ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
కేటీఆర్ ఆదేశాల మేరకే..
హెచ్‌ఎండీఏ నిధుల దుర్వినియోగానికి గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా అప్పటి ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అర్వింద్ కుమార్‌ను రెండో నిందితుడిగా, హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ లక్ష్మీనర్సింహారెడ్డిని మూడో నిందితుడిగా చేర్చింది. దర్యాప్తులో భాగంగా 2025 జనవరి 8న అర్వింద్‌కుమార్, 9న కేటీఆర్,10న బిఎల్‌ఎన్‌రెడ్డిని అదే నెల18న గ్రీన్‌కో ఏస్ నెక్స్ట్‌జెన్ ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. ఆ తర్వాత జూన్ 16న కేటీఆర్‌ను రెండో దఫా ప్రశ్నించింది.
ఈ క్రమంలోనే అర్వింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిని కూడా ఏసీబీ రెండు సార్లు విచారించింది. వీరిచ్చిన సమాచారంతో ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులను, సీఈవోను జూమ్ మీటింగ్ ద్వారా వర్చువల్‌గా విచారించారు. కేటీఆర్ ఆదేశాల మేరకే ఒప్పందాలు, నిధులు చెల్లింపు జరిగినట్లు ఏసీబీ విచారణ సమయంలో మిగిలిన నిందితులైన అర్వింద్‌కుమార్, బీఎల్‌ఎన్‌రెడ్డి సహా ఈవెంట్‌ఆర్గనైజర్లు ఏస్ నెక్స్ట్‌జెన్, ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రతినిధులు వెల్లడించడం గమనార్హం.
