- అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేసిన టైంలో అక్రమాలకు పాల్పడట్టు ఫిర్యాదులు
హనుమకొండ, వెలుగు: వ్యవసాయశాఖకు సంబంధించిన కరీంనగర్ ఫార్మర్ ట్రైనింగ్ సెంటర్లో డిప్యూటీ డైరెక్టర్గా పని చేస్తున్న హనుమకొండకు చెందిన నూనావత్ వీరూనాయక్ ఇంట్లో శుక్రవారం ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. అవినీతికి పాల్పడి, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు ఫిర్యాదులు అందడంతో ఆయన ఇంటితో పాటు సొంతూరులో తనిఖీలు చేపట్టి రూ.2.6 కోట్లకుపైగా ఆస్తులు గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ పి.సాంబయ్య కథనం ప్రకారం.. నూనావత్ వీరూనాయక్ గతంలో ఉమ్మడి వరంగల్, జనగామ, కరీంనగర్ జిల్లాల్లోఅగ్రికల్చర్ఆఫీసర్గా పని చేశారు.
ఆ టైంలో అవినీతికి పాల్పడినట్టుగా ఆరోపణలు వచ్చాయి. దాంతోపాటు ఆదాయానికి మించిన ఆస్తులున్నట్టు సమాచారం అందడంతో శుక్రవారం ఏసీబీ రంగంలోకి దిగింది. హనుమకొండ న్యూశాయంపేటలోని వీరూనాయక్ ఇంటితో పాటు ఆయన స్వగ్రామమైన మానుకోట జిల్లా గూడూరు మండలం రాముల తండాలో ఏకకాలంలో సోదాలు చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇండ్లు, వివిధ డాక్యుమెంట్లు తనిఖీ చేసి వీరూనాయక్ దగ్గర రూ.2.6 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది. విచారణ ఇంకా కొనసాగుతోందని, పూర్తి ఎంక్వైరీ తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకుని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టునున్నట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు.
