కమీషన్ల కోసమే కాళేశ్వరం.. తెలంగాణకు KCR తీరని ద్రోహం చేసిండు: మంత్రి ఉత్తమ్

కమీషన్ల కోసమే కాళేశ్వరం.. తెలంగాణకు KCR తీరని ద్రోహం చేసిండు: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్: కమీషన్ల కోసమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. బుధవారం (జూన్ 10) జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజ్‎ను సందర్శించారు. హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డకు చేరుకుని బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న జియో టెక్నికల్, జియో ఫిజికల్ పరీక్షలలో భాగంగా బోర్ హోల్స్ పనులను పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో సమీక్షా నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే రాష్ట్ర రైతాంగానికి సాగు తాగునీరు అందించడానికి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టామని తెలిపారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 30 శాతం పనులు పూర్తి చేసిందని గుర్తు చేశారు.

 అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తూ నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‎కు మంచి పేరు రావద్దని.. అలాగే కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు తెరపైకి తీసుకువచ్చారన్నారు. 

►ALSO READ | దాచిపెట్టడానికేం లేదు.. అది జస్ట్ నోటీస్ మాత్రమే: నామినేషన్ తిరస్కరణపై మీనాక్షి నటరాజన్

చేవెళ్ల నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్పు చేసి కేసీఆర్ తెలంగాణకు తీరని ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు లక్ష 45 వేల కోట్లు ఖర్చు అయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీరు కూడా ఉపయోగంలోకి రాలేదన్నారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ప్రాజెక్టు లోపాభూయిష్టంగా ఉందని నిపుణులు నివేదిక ఇచ్చారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇతర సంస్థల చేత బ్యారేజ్ కుంగుబాటుపై దర్యాప్తు జరిపించామని తెలిపారు. ఆఫ్రి సంస్థ ఆధ్వర్యంలో రీ డిజైన్ పనులు కొనసాగుతున్నాయన్నారు. జూలై మొదటి వారంలోపు పరీక్షలు పూర్తి చేస్తామని తెలిపారు.