కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమాల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో భారీ సంక్షోభం నెలకొంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు దీదీకి షాకిస్తూ వరుసగా పార్టీ వీడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో ఢిల్లీలో మమత బెనర్జీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సోనియా, మమతా భేటీ తర్వాత ఓ ఆసక్తికరమైన వార్త ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. దీదీ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారని.. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో టీఎంసీని విలీనం చేయబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోనియా, మమత ఈ అంశంపైనే ఢిల్లీ వేదికగా మంతనాలు జరిపారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని టీఎంసీ తీవ్రంగా ఖండించింది.
విలీన వార్తలపై టీఎంసీ రియాక్షన్
కాంగ్రెస్ పార్టీలో టీఎంసీని విలీనం చేయబోతున్నారంటూ జరుగుతోన్న ప్రచారాన్ని టీఎంసీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ లో టీఎంసీ విలీనానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదని వివరణ ఇచ్చింది. ఆ వార్తలు నిరాధారమైనవని టీఎంసీ కొట్టిపారేసింది. రాష్ట్ర స్థాయిలో విభేదాలు ఉన్నప్పటికీ, బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిలోని భాగస్వామ్య పార్టీలు మరింత సమర్థవంతంగా కలిసి పనిచేయడం, ఐక్యతను కాపాడుకోవడంపైనే దృష్టి సారించినట్లు తెలిపింది. టీఎంసీ వివరణతో విలీన వార్తలకు తెరపడింది.
కాంగ్రెస్ అగ్రనేతలతో మమతా, అభిషేక్ భేటీ
ఇండియా కూటమి భేటీ అనంతరం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో మమతా బెనర్జీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే, వీరిద్దరి దేనిపై చర్చించారనేది మాత్రం క్లారిటీ లేదు. సోనియా, మమత భేటీ జరిగిన తెల్లారే కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో మమత బెనర్జీ అల్లుడి అభిషేక్ బెనర్జీ సమావేశం అయ్యారు.
ALSO READ : రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్
కాంగ్రెస్ అగ్రనేతలతో మమత, అభిషేక్ బెనర్జీ వరుసగా సమావేశం కావడం రాజకీయం తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వరుస భేటీల అనంతరం కాంగ్రెస్లో టీఎంసీని విలీనం చేయబోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో విలీన వార్తలపై టీఎంసీ వివరణ ఇచ్చింది. కాంగ్రెస్ లో టీఎంసీ విలీనానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదని.. అవన్నీ నిరాధారమైన వార్తలని కొట్టిపారేసింది.
