- పెద్ద మొత్తంలో మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు పెండింగ్
- ముడుపులు ఇస్తేనే పని చేస్తున్నట్లు గుర్తింపు
మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలోని జిల్లా జనరల్ హాస్పిటల్(జీజీహెచ్)లో శుక్రవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హాస్పిటల్ లోని అడ్మినిస్ట్రేషన్ విభాగంలో మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులకు సంబంధించిన సెక్షన్ లో ముడుపులు ఇస్తేనే పనులు చేస్తున్నారని, లేకుంటే ఉద్దేశపూర్వకంగా పెండింగ్ లో ఉంచుతున్నట్లు డీజీపీకి ఫిర్యాదు అందింది.
దీంతో ఏసీబీ ఉమ్మడి మెదక్ జిల్లా డీఎస్పీ సుదర్శన్ నేతృత్వంతో తనిఖీలు నిర్వహించారు. మెడికల్ బిల్లులకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించారు. సూపరింటెండెంట్ లతీఫ్ ఉద్దీన్ ముజాయుద్దీన్ ఇన్ వార్డ్ రిజిస్టర్ ను మెయింటైన్ చేస్తున్నప్పటికీ, మూమెంట్, ఔట్ వార్డ్ రిజిస్టర్ ను సక్రమంగా నిర్వహించడం లేదని గుర్తించారు.
మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్స్ సమయానికి పంపడం లేదని, లంచం ఇస్తేనే బిల్లు పాస్ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చినట్లు డీఎస్పీ చెప్పారు. సూపరింటెండెంట్ గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఇక్కడ పని చేస్తుండగా, అతని సెక్షన్ లో 282 మెడికల్ బిల్లులు ఉన్నాయని తెలిపారు.
అతను వచ్చినప్పటి నుంచి 116 మెడికల్ బిల్లులు ప్రాసెస్ చేసి సంబంధిత శాఖలకు పంపించకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఆ బిల్లు ఎవరిదో వారిని పిలిచి ఇస్తున్నట్లు తేలిందన్నారు. మెడికల్ బిల్లుల విషయంలో నిర్లక్ష్యాన్ని, నిబంధనల ఉల్లంఘనపై నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేస్తామని డీఎస్పీ తెలిపారు.
