ఇరిగేషన్ AEE నికేష్ ఇంట్లో సోదాలపై ఏసీబీ కీలక ప్రకటన

ఇరిగేషన్ AEE నికేష్ ఇంట్లో సోదాలపై ఏసీబీ కీలక ప్రకటన

హైదరాబాద్: నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హేరూర్ నికేశ్ కుమార్‌ ఇంట్లో సోదాలపై ఏసీబీ కీలక ప్రకటన చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించి ఇరిగేషన్ ఏఈఈ నికేశ్ కుమార్‌ ఇంట్లో సోదాలు జరిపామని ఏసీబీ వెల్లడించింది. నికేష్ కుమార్ ఇంటితో పాటు  అతని బంధువులకు చెందిన 19 ఇతర ప్రదేశాలలో తనిఖీలు చేశామని తెలిపారు. 

తనిఖీల్లో భాగంగా 5 ఇళ్ల స్థలాలు, 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, 6 ఫ్లాట్లు, 2 వాణిజ్య స్థలాలకు సంబంధించిన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.  రూ.17 కోట్ల 73 లక్షల 53 వేల 500 రూపాయల అధికారిక విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ఏడాది మే 30న ఓ భవన నిర్మాణానికి ఎన్‌ఓసీ జారీ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‎గా ఏఈఈ నికేష్ పట్టుబడ్డాడని పేర్కొన్నారు. 

కాగా, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఏఈఈ నికేష్ కుమార్ నివాసంలో శనివారం (నవంబర్ 30) ఏసీబీ సోదాలు చేసింది. నికేష్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 30 చోట్ల రైడ్స్ చేశారు. ఈ సందర్భంగా నికేష్ పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. అసైన్డ్ భూముల్లో నిర్మాణాలకు అనుమలు ఇచ్చి లంచాలు తీసుకున్నట్లు ఏఈఈ నికేష్ కుమార్‏పై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి.