మహబూబాబాద్ జిల్లాలో ఆకస్మిక దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. గురువారం ( నవంబర్ 6 ) మురిపెడ మండలంలోని నీలకుర్తిలో నిర్వహించిన ఈ సోదాల్లో రూ.. 10 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు ఏఈవో సందీప్. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మరిపెడ మండలం నీలకుర్తిలో రైతు దగ్గర లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు ఏఈవో సందీప్.
రైతు భీమా పథకాన్ని వర్తింపజేయడం కోసం లంచం డిమాండ్ చేశారు ఏఈవో సందీప్. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు.. ఆకస్మిక దాడులు నిర్వహించి ఏఈవో సందీప్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.
ఇదిలా ఉండగా.. గురువారం (అక్టోబర్ 30) మెదక్ జిల్లా ట్రాన్స్ కో డీఈ లంచం తీసుకుంటూ పట్టుబడటం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. పాపన్నపేట మండలం సీతానగర్ తండాకు చెందిన పాపగారి భాస్కర్.. ఆయన తల్లి పేరిట ఉన్న పౌల్ట్రీ ఫాం కోసం 25 కేవీఏ ట్రాన్స్ఫర్మర్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నాడు. ట్రాన్స్ ఫార్మర్ సాంక్షన్ కు డివిజనల్ ఇంజినీర్ (డీఈ) షేక్ షరీఫ్ చాంద్ భాషా రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు.
లంచం ఇవ్వకపోతే పని అయ్యేలా లేదని కొద్ది రోజుల ముందు రూ.9 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా చెల్లించాడు. మిగతా డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడు పాపగారి భాస్కర్. తాము చెప్పినట్లుగా క్యాష్ ను డీఈకి ఇవ్వాల్సిందిగా చెప్పిన అధికారులు.. సరిగ్గా గురువారం(అక్టోబర్ 30) రూ.21 వేలు తీసుకుంటుండగా రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
