అక్రమాస్తుల కేసులో అరెస్టైన సిటీ సెంట్రల్ క్రైమ్‌స్టేషన్ (సీసీఎస్) ఏసీపీ ఉమా మహేశ్వరరావును కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నారు ఏసీబీ అధికారులు. నిన్న ఉమా మహేశ్వరరావుతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇండ్లలో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. మొత్తం 14 చోట్ల సోదాలు ఈ దాడులు కొనసాగాయి. ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఈ డాడుల్లో మూడు కోట్ల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో నగదు 38 లక్షలు, 60 తులాల బంగారు ఆభరణాలతో పాటు వెండి వస్తువులు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకి చెందిన ఉమామహేశ్వర్‌రావు1995 బ్యాచ్ ఎస్‌ఐ. సిటీ కమిషనరేట్ పరిధిలో ఎక్కువ కాలం పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అబిడ్స్ పీఎస్‌లో విధులు నిర్వర్తించారు. ఓ కేసు దర్యాప్తులో అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. రాచకొండ కమిషనరేట్‌పరిధి జవహర్‌నగర్ పీఎస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ బాధిత మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి, సస్పెన్షన్‌కు గురయ్యారు.
ఆ తర్వాత ఇబ్రహీంపట్నం ఏసీపీగా విధులు నిర్వహించారు. ఇక్కడ కూడా సివిల్ వివాదాల్లో తలదూర్చారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఉమామహేశ్వర్ రావును సస్పెండ్ చేశారు. ప్రస్తుతం సిటీ కమిషనరేట్‌పరిధిలోని సీసీఎస్‌లో ఏసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
