- ఏసీబీ డైరెక్టర్ నేతృత్వంలో కీలక సమావేశం
- ఇప్పటికే ఏసీబీకి చేరిన డీవోపీటీ ఫైల్
- న్యాయ నిపుణులతో చర్చించిన ఏసీబీ డైరెక్టర్
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ రేస్ కేసులో చార్జ్‌షీట్ దాఖలుకు ఏసీబీ చర్యలు ముమ్మరం చేసింది. ప్రధాన నిందితుడు, మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అర్వింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి లభించడంతో తదుపరి చర్యలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఏసీబీ డైరెక్టర్ చారుసిన్హా నేతృత్వంలో బుధవారం కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో చార్జ్‌షీట్‌కు సంబంధించిన అంశాలపై విచారణ అధికారులు, న్యాయనిపుణులు సుదీర్ఘంగా చర్చించారు.
కాగా, ఐఏఎస్ అర్వింద్‌కుమార్ ప్రాసిక్యూషన్ అనుమతులకు సంబంధించిన డీవోపీటీ ఫైల్ సోమవారం ఏసీబీకి చేరింది. కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన గవర్నర్ ఉత్తర్వులు గతంలోనే ఏసీబీకి చేరాయి. ఈ క్రమంలోనే కేటీఆర్, అర్వింద్‌కుమార్ సహా ఆరుగురు నిందితులపై అభియోగాలకు సంబంధించిన రికార్డులను ఏసీబీ అధికారులు సిద్ధం చేస్తున్నారు. న్యాయనిపుణుల సలహాలు, సూచనల మేరకు చార్జ్‌షీట్ రూపొందిస్తున్నారు.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఈవెంట్ల కోసం గత ప్రభుత్వంలో చేసుకున్న అగ్రిమెంట్లు,హెచ్‌ఎండీఏ బోర్డు నిధుల దుర్వినియోగంతో పాటు బీఆర్‌ఎస్ పార్టీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన ఆధారాలతో చార్జ్‌షీట్ సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే కోర్టులో దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
