కల్వకుర్తి/గరిడెపల్లి, వెలుగు: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి వ్యవసాయ శాఖ ఏడీఏ కార్యాలయంలో శనివారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కల్వకుర్తిలో ఏడీఏగా పనిచేస్తున్న ఎస్.కిరణ్ కుమార్‌పై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు కల్వకుర్తి కార్యాలయంలోని రికార్డులను తనిఖీ చేశారు.
ఇక్కడ తనిఖీలు నిర్వహించడంతో పాటు అధికారి సొంత గ్రామమైన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని అధికారి బంధువుల ఏడుగురు ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
