ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో ACB సోదాలు.. కోటీ 40 లక్షల డబ్బు.. కేజీ బంగారం స్వాధీనం

ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో ACB సోదాలు.. కోటీ 40 లక్షల డబ్బు.. కేజీ బంగారం స్వాధీనం

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ల్యాండ్స్ & సర్వే (మల్టీ జోన్-2) డిప్యూటీ డైరెక్టర్ ఎస్. నరహరి నివాసంలో, ఆయనకు సంబంధించిన ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు చేసింది. ఈ ఏసీబీ సోదాల్లో ఇప్పటిదాకా కోటీ 40 లక్షల నగదుతో పాటు పలు ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు లభ్యం కావడం గమనార్హం. 

ACB డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలో.. ఛత్రీనాకలోని నరహరి ఇంటితో పాటు నారాయణగూడలోని ఆయన కార్యాలయం.. ఆయన బంధువులు, సన్నిహితులకు సంబంధించిన ఆస్తులపై ఏసీబీ దాడులు జరిగాయి. 

హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని 11 చోట్ల ఈ సోదాలు జరిగాయి. నరహరికి సంబంధించి.. భారీ మొత్తంలో ఉన్న బ్యాంక్ డిపాజిట్ల వివరాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఆస్తులు, బ్యాంక్ ఖాతాలు, పెట్టుబడులపై ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతోంది.

అనధికార అంచనా ప్రకారం.. నరహరి మొత్తం రూ.50 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. సర్వే ల్యాండ్ రికార్డ్స్ మల్టీ జోన్-2 డిప్యూటీ డైరెక్టర్ నరహరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రతీ ల్యాండ్ రికార్డ్స్ విషయంలో.. క్రింది స్థాయి ఉద్యోగులతో కలిసి లంచాలకు మరిగినట్లు ఆయనపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో.. తెలంగాణ ఏసీబీ అధికారులు నరహరి ఆస్తిపాస్తులపై దాడులు చేయడం గమనార్హం.

ఈ సోదాలపై ఏసీబీ అధికారి శ్రీధర్ మాట్లాడుతూ.. పాత బస్తీ ఛత్రినాకలోని నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయని.. ఇప్పటి వరకు కేజీ బంగారం, కోటీ 40 లక్షల రూపాయల నగదు.. కీలక ఆస్తి పత్రాలను గుర్తించినట్లు తెలిపారు. నరహరిని మంగళవారం అరెస్ట్ చేస్తామని ఏసీబీ అధికారి శ్రీధర్ తెలిపారు.