జగిత్యాల మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు

 జగిత్యాల మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు
  • పది గంటల పాటు విస్తృత తనిఖీలు

జగిత్యాల, వెలుగు: జగిత్యాల మున్సిపాలిటీలో జరిగిన అవకతవకలపై కరీంనగర్ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పలు ఫిర్యాదుల నేపథ్యంలో మంగళవారం దాదాపు పది గంటలపాటు మున్సిపల్ కార్యాలయంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ ఆదేశాల మేరకు సీఐ పూర్ణచందర్ నేతృత్వంలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఆడిటర్లతో కూడిన బృందం మున్సిపాలిటీలోని అన్ని విభాగాలను పరిశీలించింది. ఈ సందర్భంగా పలు అవకతవకలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. గతంలో హోర్డింగ్స్ ద్వారా సుమారు రూ.80 లక్షలు వసూలు చేసినప్పటికీ ఈ ఏడాది ఆ వసూళ్లు జరగలేదని, అడ్వర్టైజ్‌మెంట్ ట్యాక్స్ కూడా సేకరించలేదని పేర్కొన్నారు.

మున్సిపాలిటీకి చెందిన నాలుగు ఆటోలు, ఒక ట్రాక్టర్ మిస్సింగ్‌ కాగా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అధికారులు గుర్తించారు. అలాగే మున్సిపల్ అద్దె భవనాలకు 18 ఏండ్లుగా రీ-టెండరింగ్ నిర్వహించకపోవడం తనిఖీల్లో బయటపడింది. 

పెండింగ్​ దరఖాస్తులపై విచారణ..

ఎల్ఆర్ఎస్, బిల్డింగ్ పర్మిషన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంపై విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఫాగింగ్‌కు సంబంధించిన రికార్డులు నిర్వహించకపోవడం, స్టేషనరీ, శానిటేషన్ సామగ్రి కొనుగోళ్లకు జీఎస్టీ బిల్లులు లేకపోవడాన్ని గుర్తించారు. అధికారుల యూపీఐ లావాదేవీలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.. బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయకపోవడం కూడా తనిఖీల్లో బయటపడింది. తనిఖీల సమయంలో ఏఈలు అనిల్, లక్ష్మి తమ సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు.