- 8 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు
- కిలో బంగారం, రూ.9 లక్షలు, ఇండ్లు, భూములు గుర్తింపు
హైదరాబాద్,వెలుగు: రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డిపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లోని మధుసూదన్‌రెడ్డి ఇండ్లు, బంధువులు, స్నేహితుల ఇండ్లు సహా 8 ప్రాంతాల్లో శుక్రవారం సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.9 లక్షలు, కిలోకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్నది.
ఇండ్లు, పెద్ద ఎత్తున భూములు, కమర్షియల్ ప్లాట్లు ఉన్నట్టు గుర్తించింది. ఏఆర్‌కే స్పిరిట్స్ పేరుతో మద్యం వ్యాపారం చేసి రూ.80 లక్షల పెట్టుబడి పెట్టడంతో పాటు తన భార్య, పిల్లల పేర్లతో రెండు షెల్ కంపెనీలు సృష్టించినట్టు ఆధారాలు సేకరించింది. మధుసూదన్ రెడ్డి అక్రమంగా సంపాదించిన ఆస్తుల విలువ దాదాపు రూ.8 కోట్లు ఉంటుందని ఏసీబీ లెక్కగట్టింది.
గుర్తించిన ఆస్తులివీ..
కాప్రా భవానీ నగర్‌లో ట్రిపుల్ బెడ్‌రూమ్ ఇండిపెండెంట్ హౌస్, ఇబ్రహీంపట్నం దగ్గర చింతపల్లిగూడా గ్రామంలో ఓపెన్ ప్లాట్, పరిగి మండలంలోని నస్కల్ గ్రామంలో 27 ఎకరాల వ్యవసాయ భూమి, ఇబ్రహీంపట్నం మంగల్‌పల్లిలో ఎకరం కమర్షియల్ ల్యాండ్, పరిగి మండలంలోని నస్కల్ గ్రామ పరిధిలో ఎకరంన్నరలో ఫామ్‌హౌస్, స్విమ్మింగ్ పూల్, ఇన్నోవా ఫార్చునర్, వోల్వో ఎక్స్‌సీ 60 బీ5, వోక్స్ వ్యాగన్ కార్లు.
