మహిళా ఐఏఎస్ ఇంటిపై ఏసీబీ దాడులు

మహిళా ఐఏఎస్ ఇంటిపై ఏసీబీ దాడులు

బెంగళూరు:  మహిళా ఐఏఎస్‌ అధికారి సుధ ఇంటిపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు దాడులు నిర్వహించారు.  ‌కర్ణాట‌కలోని ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ బ‌యోటెక్నాల‌జీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా ప‌ని చేస్తున్న సుధ పై పలు అవినీతి ఆరోపణల ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు వెంటనే స్పందించి తనిఖీలు చేపట్టారు. యువ మహిళా ఐఏఎస్ అధికారిణి ఇంట్లో ఏసీబీ చేపట్టిన దాడులు దేశ వ్యాప్తంగా అధికార వర్గాల్లో కలకలం రేపాయి. అయితే లోకాయుక్తలో ఫిర్యాదు మేరకే దాడులు చేపడుతుండడంతో కలకలం వెంటనే సద్దుమణిగింది.

బెంగళూరులోని కొడిగ‌హ‌ల్లి, యెల‌హంక‌లోని నివాసాలతోపాటు  మైసూరు, ఉడిపిలో ఉన్న సుధ ఇళ్లపై ఏక కాలంలో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఈమె గతంలో బెంగుళూరు డెవ‌ల‌ప్మెంట్ అథారిటీలో ల్యాండ్ అక్విజిష‌న్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేసి ప్రస్తుతం బ‌యోటెక్నాల‌జీ శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. మహిళా ఐఏఎస్ అధికారిణి అయిన సుధ భర్త శాండల్‌వుడ్‌లో సినీ నిర్మాతగా ఉన్నారు. లంచాలు తీసుకుని.. అవినీతి అక్రమాలకు పాల్పడి సంపాదించిన డబ్బుతో సుధ సినిమా రంగంలో పెట్టుబడులు పెట్టి సినిమాలను నిర్మిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సుధ అవినీతికి సంబంధించి లోకాయుక్తలో పిటిషన్‌ దాఖలు అయింది. ఆరోపణల నిగ్గు తేల్చేందుకు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించగా రశీదులు లేని ఆభరణాలు.. కొంత నగదు దొరికినట్లు సమాచారం.