మాజీ డీఎస్పీ భీమ్‌‌ రెడ్డి బినామీ ఇంట్లో రూ.1.35 కోట్లు సీజ్‌‌ 

మాజీ డీఎస్పీ భీమ్‌‌ రెడ్డి బినామీ ఇంట్లో రూ.1.35 కోట్లు సీజ్‌‌ 
  • 8 మంది బినామీల పేర్లపై భీమ్‌‌రెడ్డి అక్రమాస్తులు
  •  హైదరాబాద్‌‌, జహీరాబాద్‌‌లోని 10 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు
  • మణికొండ పంచవటి కాలనీలోని సీఏ వెంకటేశ్​ ఇంట్లో తనిఖీలు

హైదరాబాద్‌‌, వెలుగు: మాజీ డీఎస్పీ భీమ్​రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని సంపాదించిన అక్రమాస్తుల గుట్టు విప్పుతోంది. ఇందులో భాగంగా ఆయన బినామీల ఇళ్లలో గురువారం సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ పుప్పాలగూడలోని భీమ్‌‌రెడ్డి నివాసంతో పాటు ఆయన చార్టెడ్ అకౌంటెంట్‌‌ బొమ్మ వెంకటేశ్‌‌ సహా బినామీలుగా గుర్తించిన 8 మంది ఇళ్లలో తనిఖీలు చేసింది.

హైదరాబాద్‌‌, జహీరాబాద్‌‌ పరిధిలోని10 ప్రాంతాల్లోని వారి నివాసాల్లో  సోదాలు నిర్వహించింది. మణికొండ పంచవటి కాలనీలోని బొమ్మ వెంకటేశ్‌‌ నివాసంలో రూ.1.35 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. నగదుతో పాటు విదేశీ కరెన్సీ, 14 లీటర్ల విదేశీ మద్యం సహా ఆస్తులకు సంబంధించిన పలు కీలక పత్రాలను సీజ్ చేసింది. కాగా, భీమ్‌‌రెడ్డికి సంబంధించిన ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాలు సహా వ్యాపార సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాల్లో సీఏ వెంకటేశ్​తో నగదు లావాదేవీలు జరిపినట్లు గుర్తించిన ఏసీబీ.. ఈ క్రమంలోనే భీమ్‌‌రెడ్డికి వెంకటేశ్​బినామీగా వ్యవహరించినట్లు ఆధారాలు సేకరించింది.

మరోవైపు మాజీ డీఎస్పీ ఆస్తులపై ఇప్పటికే ఐటీ, ఈడీ కేసులు నమోదు చేసి బినామీలను విచారిస్తున్నాయి. డీజీపీ కార్యాలయంలో పోలీస్‌‌ కంప్యూటర్‌‌ సర్వీసెస్‌‌ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న సమయంలో భీమ్‌‌రెడ్డిపై జూన్‌‌ 27న ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఆస్తులు, భూములు, ఇళ్లు, బ్యాంకు డిపాజిట్లు తదితర వివరాలను ఏసీబీ గుర్తించింది.

16 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టగా, ప్రస్తుత మార్కెట్‌‌ విలువ ప్రకారం రూ.200 కోట్లకు పైగా ఆస్తులను స్వాధీనం చేసుకుంది. 57 రోజుల పాటు చంచల్‌‌గూడ జైలు రిమాండ్‌‌లో ఉన్న ఆయన సెప్టెంబర్‌‌‌‌ 1న బెయిల్‌‌పై విడుదలయ్యారు. కేసు దర్యాప్తులో భాగంగా బినామీ ఆస్తులను గుర్తించేందుకు ఏసీబీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. చార్టెడ్ అకౌంటెంట్‌‌ వెంకటేష్ సహా 8 మంది ఇళ్లలో సోదాలు నిర్వహించేందుకు సెర్చ్‌‌ వారెంట్లు తీసుకున్నారు.

బొమ్మ వెంకటేశ్‌‌ నివాసంలో స్వాధీనం చేసుకున్న రూ.1.35 కోట్ల నగదుకు సంబంధించి భీమ్‌‌రెడ్డితో ఉన్న లింకులుపై ఆరా తీస్తున్నారు. విదేశీ మద్యానికి సంబంధించిన కేసు దర్యాప్తును ఎక్సైజ్‌‌ శాఖ అధికారులకు అప్పగించారు. మరికొందరి ఇళ్లలో సోదాలు చేసినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిసింది.