
కూకట్పల్లి, వెలుగు: జీహెచ్ఎంసీ మూసాపేట సర్కిల్ ట్యాక్స్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎం.సునీత మంగళవారం లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపిన ప్రకారం.. సర్కిల్ పరిధిలోని ఓ ఇంటికి మ్యుటేషన్ చేయాలని వారం కింద ఓ వ్యక్తి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు.
దరఖాస్తుని ఆన్లైన్లో క్లియర్ చేయకుండా హార్డ్ కాపీలు కావాలని దరఖాస్తుదారుడిని సునీత కార్యాలయానికి పిలిపించుకున్నారు. మ్యుటేషన్ చేసి ట్యాక్స్ ఫిక్స్ చేయాలంటే తనకు రూ.80 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసింది. సదరు వ్యక్తి అంత ఇవ్వలేనని చెప్పడంతో రూ. 30 వేలకు అంగీకరించింది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.
మంగళవారం మధ్యాహ్నం సునీతకు ఆఫీసులో బాధితుడు రూ.30 వేలు ఇచ్చాడు. వెంటనే ఏసీబీ అధికారులు అక్కడికి వెళ్లి లంచంగా తీసుకున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. కెమికల్ టెస్టులో సునీత డబ్బు తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.