పెరిగిన పెట్రో ధరలను భరించాల్సిందే

పెరిగిన పెట్రో ధరలను భరించాల్సిందే

న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా దేశంలో పెట్రో ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకీ కొన్ని పైసలు పెరుగుతూ పలు రాష్ట్రాల్లో సెంచరీని దాటిన ఫ్యుయల్ రేట్స్.. మరికొన్ని స్టేట్స్‌లో వందకు చేరువలో ఉంది. ఈ విషయంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సమస్యాత్మకం అయినప్పటికీ దీన్ని ప్రజలు ఆమోదించాలన్నారు. ఈ డబ్బులను ప్రజలకు లబ్ధి చేకూర్చే సంక్షేమ పథకాల అమల కోసం ఆదా చేస్తున్నామని తెలిపారు. 

‘ప్రస్తుత పెట్రో ధరలు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయనే విషయాన్ని అంగీకరిస్తున్నా. కానీ ఈ ఏడాది వ్యాక్సినేషన్ కోసం రూ.35 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇలాంటి భయంకర పరిస్థితుల్లో సంక్షేమ పథకాల అమలు కోసం మేం డబ్బులను కాపాడుతున్నాం. పేద ప్రజలకు ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ఎనిమిది నెలల పాటు ఆహార ధాన్యాలు అందించేందుకు మోడీ సర్కార్ లక్ష కోట్లు ఖర్చు పెట్టింది. పీఎం కిసాన్ యోజన కింద రైతుల ఖాతాల్లో వేలాది కోట్ల రూపాయలను వేశాం. రీసెంట్‌గా కనీస మద్దతు ధరనూ పెంచాం. ఇవన్నీ ఒకే సంవత్సరంలో చేశామనే విషయాన్ని అర్థం చేసుకోవాలి’ అని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.