పోలీస్ అధికారిని కత్తితో పొడిచి చంపిన దుండగుడు

పోలీస్ అధికారిని కత్తితో పొడిచి చంపిన దుండగుడు

అమెరికా క్యాపిటల్ హిల్ బిల్డింగ్ దగ్గర ఓ దుండగుడు బీభత్సం సృష్టించాడు. కారుతో వేగంగా వచ్చిన దుండగుడు బిల్డింగ్ దగ్గర ఉన్న బారికేడ్‌ను బలంగా ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత కారు దిగిన దుండగుడు.. ఓ పోలీసు అధికారి మీద కత్తితో దాడి చేసి పొడిచాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పోలీసు అధికారి చికిత్స పొందుతూ చనిపోయాడు. దుండగుడు కాల్పులు జరిపిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. దుండగుడిని అక్కడికక్కడే కాల్చి చంపారు. పోలీసులపై దాడి నేపథ్యంలో క్యాపిటల్ హిల్ బిల్డింగ్ దగ్గర నేషనల్ గార్డ్స్‌ను మొహరించారు. ఈ ఘటనతో ఉగ్రవాదులకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు తేల్చారు. ఈ ఘటనతో క్యాపిటల్ బిల్డింగ్‌ను తాత్కాలికంగా మూసివేశారు.

క్యాపిటల్ హిల్ దగ్గర జరిగిన దాడిలో పోలీస్ అధికారి బిల్లి ఎవన్స్ మృతిచెందడం పట్ల అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన అధికారి మృతికి సంతాప సూచకంగా వైట్ హౌస్‌లోని జాతీయ జెండాను వారం రోజుల పాటు అవనతం చేయాలని సూచించారు. ఎవన్స్ మృతి పట్ల అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హరీష్ కూడా తన సంతాపం తెలిపారు. మాటల్లో వర్ణించలేని హింసలో ఓ సాహసోపేతమైన పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారని ట్వీట్ చేశారు. క్యాపిటల్‌ను రక్షించేందుకు ఎవన్స్ తన ప్రాణాలు కోల్పోయాడన్నారు.  

జనవరి 6న ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ బిల్డింగ్‌పై చేసిన దాడి తర్వాత ఆ తరహా ఘటన ఇదేనని అధికారులు తెలిపారు. అప్పుడు జరిగిన ఘటనలో ఓ పోలీసు అధికారి సహా ఐదుగురు చనిపోయారు.