అక్రెడిటేషన్ల కోత అవాస్తవం..మీడియా కార్డు ఉన్నా.. అన్ని ప్రయోజనాలు వర్తిస్తాయి: మంత్రి పొంగులేటి

అక్రెడిటేషన్ల కోత అవాస్తవం..మీడియా కార్డు ఉన్నా.. అన్ని ప్రయోజనాలు వర్తిస్తాయి: మంత్రి పొంగులేటి
  •     జర్నలిస్టు సంఘాల సూచనలతో జీవో 252లో మార్పులు
  •     ఇండ్ల స్థలాల విషయంలో కోర్టు చిక్కులు లేని విధానం తెస్తం
  •     14 జర్నలిస్టు సంఘాలతో భేటీలో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇచ్చే అక్రెడిటేషన్ కార్డుల సంఖ్యను తగ్గిస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఐ అండ్​ పీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకూ అక్రెడిటేషన్ దక్కుతుందని.. గతంలో జారీ చేసిన 23 వేల కార్డుల కంటే ఈసారి ఎక్కువగానే మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. శనివారం సచివాలయంలో జీవో 252పై 14 జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని జీవో 252లో అవసరమైన మార్పులు చేర్పులు చేస్తామని హామీ ఇచ్చారు. 

డెస్క్​ జర్నలిస్టులకు, రిపోర్టర్లకు వేర్వేరుగా కాకుండా ఒకటే కార్డు ఉండాలని డెస్క్​ జర్నలిస్ట్​ ఫెడరేషన్​ ఆఫ్​ తెలంగాణ (డీజేఎఫ్​టీ) మంత్రి పొంగులేటికి విజ్ఞప్తి చేసింది. మీడియా కార్డుతో డెస్క్​ జర్నలిస్టులలో ఆందోళన నెలకొన్నదని, అదే సమయంలో వేరు కార్డులతో తమ స్థాయిని తగ్గించినట్టుగానే భావిస్తున్నట్టు డీజేఎఫ్​టీ వివరించింది. అలాగే, అక్రెడిటేషన్​ కమిటీల్లో డెస్క్​ జర్నలిస్టులకు స్థానం కల్పించాలని కోరారు. అయితే, అక్రెడిటేషన్ కార్డుకు, మీడియా కార్డుకు మధ్య వ్యత్యాసం ఉందన్న ఆందోళన అవసరం లేదని మంత్రి తెలిపారు. 

అక్రెడిటేషన్ కార్డుదారులకు ప్రభుత్వం నుంచి అందే ప్రతి ప్రయోజనం మీడియా కార్డు ఉన్నవారికి కూడా వర్తిస్తుందని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని తేల్చిచెప్పారు. అయినప్పటికీ మీడియా కార్డు కాకుండా అక్రెడిటేషన్​ కార్డు మాత్రమే ఇవ్వాలని డెస్క్​ జర్నలిస్టులు కోరగా.. జీవోలో మార్పు చేసే దానిపై ఆలోచన చేస్తామన్నారు. అక్రిడిటేషన్ కమిటీల్లో ఉర్దూ జర్నలిస్టులకు అవకాశం కల్పిస్తామన్నారు. క్రీడా, సాంస్కృతిక, క్రైమ్, కేబుల్ టీవీ విభాగాల వారికీ అక్రెడిటేషన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. మహిళా జర్నలిస్టుల విజ్ఞప్తి మేరకు కార్డుల జారీలో వారికి ప్రత్యేక కోటా కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

న్యాయపరమైన చిక్కులు లేకుండా ఇండ్ల స్థలాలు

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపుపై మంత్రి సానుకూలంగా స్పందించారు. గతంలో జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి భూమిని అప్పగించినప్పటికీ.. సుప్రీంకోర్టు తీర్పుతో ఆ ప్రక్రియ ఆగిపోయిందని గుర్తుచేశారు. 

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు.. భవిష్యత్తులో ఎటువంటి కోర్టు అడ్డంకులు, న్యాయపరమైన చిక్కులు రాని విధంగా పకడ్బందీ విధానాన్ని రూపొందించి జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. సమావేశంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్​రెడ్డి, ఐ అండ్ పీఆర్ కమిషనర్ ప్రియాంక, సీపీఆర్వో మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.