
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తో పాటు, కేటీఆర్, కవిత తదితర ప్రముఖులకు మంగళవారం ఓ అజ్ఞాతవ్యక్తి మురుగునీరు పార్సిళ్లు పంపిన సంగతి తెలిసిందే. రెండు రోజులుగా ఈ విసయం చర్చనీయాంశం కాగా.. గురువారం ఆ మురుగునీటి పార్సిళ్లు పంపిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా అతడిని సికింద్రాబాద్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నామని తెలిపారు పోలీసులు. అయితే తమ ప్రాంతంలో తాగునీరు ఇలా కలుషితంగా వస్తుందని..దీనిని ప్రభుత్వం దృష్టిగా తీసుకొచ్చేందుకే అతడు ఈ ప్లాన్ వేసినట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
ఆ పార్సిళ్లు చూసి షాక్..
సికింద్రాబాద్ హెడ్ పోస్టాఫీసులో మంగళవారం వీటిని చూసిన అధికారులు షాక్ అయ్యారు. ఈ సందర్భగా మాట్లాడారు పోస్టాఫీస్ అధికారులు.. ‘సికింద్రాబాద్ పోస్టాఫీస్ కి ఒకే తరహాలో 60 బాక్సులు వచ్చాయి. వాటి నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోంది. వాటిని డెలివరీ చేయాల్సిన అడ్రస్ లను చూసి ఆశ్చర్యపోయారు పోస్టాఫీస్ సిబ్భంది. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.అంజనీకుమార్, ఐదుగురు డీసీపీలు… ఇలా అంతా ప్రముఖుల పేర్లే ఉన్నాయి. పార్సిళ్లు చేసిన వ్యక్తి తెలివిగా ఫ్రమ్ అడ్రస్ రాయలేదు. బాక్సుల్ని ఓపెన్ చేసి చూస్తే సీసాలు కనిపించాయి. వాటిల్లో రసాయనాల మాదిరి ద్రవం ఉంది. ఒక్కోసీసాలో లీటరున్నర దాకా ఉంటుంది. రసాయన బాంబులేమోనన్న అనుమానంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాం. రంగంలోకి దిగిన పోలీస్ టీమ్ సీసాలను పరిశీలించింది. ఇందులో ఏవైనా విష పదార్థాలు, పేలుడు పదార్థాలున్నాయా అని నిర్ధారించుకునేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అందులో ఉన్నవి రసాయనాలు కాదని..మురుగు నీరు అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నాం’ అని తెలిపారు అధికారులు.