పోలీస్ స్టేషన్ లో నే నిందితురాలి ఆత్మహత్యాయత్నం..కరన్ కోట్  (తాండూరు రూరల్) లో  ఘటన

పోలీస్ స్టేషన్ లో నే నిందితురాలి ఆత్మహత్యాయత్నం..కరన్ కోట్  (తాండూరు రూరల్) లో  ఘటన
  • పరిస్థితి విషమం.. రహస్యంగా హైదరాబాద్​కు తరలింపు
  • మొన్నటికి మొన్న సంకెళ్లతో పీఎస్​ నుంచి ఓ కిడ్నాపర్ పరార్

తాండూరు, వెలుగు: వికారాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఇద్దరు మహిళల దారుణ హత్య కేసులో ఓ నిందితురాలు.. ఏకంగా పోలీస్​స్టేషన్​లోనే యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్, యాలాల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మిస్సింగ్​కేసులుగా నమోదై, ఆ తర్వాత హత్యలుగా తేలిన ఈ కేసులకు సంబంధించి నిందితులు రెహమాన్, కరీంబీ, నయీమ్​ను.. తాండూరు పోలీసులు శనివారం చేవెళ్ల పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకుని కరన్​కోట్ (తాండూరు రూరల్) పోలీస్ స్టేషన్​లో ఉంచారు. 

అర్ధరాత్రి సమయంలో నిందితురాలు కరీంబీ వాష్​రూంకు వెళ్లొస్తానని చెప్పి, అక్కడ క్లీనింగ్ కోసం ఉంచిన యాసిడ్‌ తాగింది. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో తొలుత వికారాబాద్ ఆసుపత్రికి, ఆపై హైదరాబాద్​​లోని నిమ్స్​ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు. మొన్నటికి మొన్న ఓ బాలిక కిడ్నాప్ కేసు నిందితుడు పోలీస్ స్టేషన్ నుంచి సంకెళ్లతోనే పరారు కాగా, తాజాగా హత్య కేసు నిందితురాలు స్టేషన్ లోపలే యాసిడ్ తాగడం చర్చనీయాంశమైంది.