రెండున్నర దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తున్న వ్యక్తికి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. ఏండ్లుగా నడుస్తున్న కేసు తీర్పు విని సంతోషంలో ఆ వ్యక్తి గుండె ఆగింది. బీహార్ బంకా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బంకా జిల్లాకు చెందిన నాగో సింగ్(76) పంట నాశనం చేశాడన్న ఆరోపణలపై 1996లో కేసు నమోదైంది. పోలీసులు నాగోసింగ్ తో పాటు మరో నలుగురి పేర్లు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. కొంతకాలం పాటు విచారణ ఖైదీలుగా జైలు జీవితం కూడా గడిపారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చినా 26 ఏళ్లుగా కేసు విచారణకు హాజరవుతూనే ఉన్నారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి తీర్పు వెలువరించిన న్యాయస్థానం నాగో సింగ్ తో పాటు నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. రెండున్నర దశాబ్దాలుగా కోర్టు చుట్టూ తిరుగుతున్న నాగో సింగ్ ఆ తీర్పు వెలువడగానే ఆనందం పట్టలేకపోయాడు. ఆ సంతోషంలోనే ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే నాగోసింగ్ గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
ఈ కేసులో 26 ఏళ్ల పాటు పోరాడామని, సాక్ష్యాధారాలు లేకపోవడంతో నాగో సింగ్‌తో పాటు ఇతరులను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసిందని కుటుంబీకులు చెప్పారు. నాగోసింగ్‌కు న్యాయం జరగడంలో జాప్యం జరిగిందని మృతుడి బంధువులు ఆరోపించారు. నాగోసింగ్ తాను నిర్దోషినని ఎప్పుడూ చెబుతుండేవాడని, అయినా అతన్ని జైలులో పెట్టాడని తెలిపారు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు 26 ఏళ్ల పాటు పోరాడిన నాగోసింగ్ చివరకు కోర్టులోనే కన్నుమూశారని కుటుంబసభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. అయితే దశాబ్దాల తర్వాత కోర్టులో నిర్దోషులుగా తేలిన ఘటన ఇదే మొదటిది కాదు.. ఈ నెల 11న బక్సర్ కోర్టు 43 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది.
