హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న బీఆర్ఎస్ వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్పై చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కక్ష సాధింపైతే ఎప్పుడో అరెస్ట్ చేసేవాళ్లమని కౌంటర్ ఇచ్చారు. ఫార్ములా ఈ రేస్ కేసులో చట్ట ప్రకారమే ముందుకెళ్తామని పేర్కొన్నారు.
పదేండ్లు రాష్ట్రాన్ని దోచుకున్నతిన్న వాళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎవరి మీద కక్ష సాధించాలన్న ఆలోచన లేదని చెప్పారు. కాళేశ్వరం కేసును సీబీఐ అప్పగించి మూడు నెలలు కావస్తోందని.. మరీ కేంద్ర పరిధిలోని సీబీఐ కాళేశ్వరంపై ఎందుకు విచారణ చేపట్టడం లేదో కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ నుంచి అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. ప్రజా ప్రతినిధిగా ఉన్నందు వల్ల కేటీఆర్పై చర్యలకు గవర్నర్ నుంచి అనుమతి కోరుతూ ఇటీవల ప్రభుత్వం లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం రాసిన లేఖపై స్పందిస్తూ.. గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ విచారణకు గురువారం అనుమతి ఇచ్చారు. దీంతో.. త్వరలో ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ ఎదుర్కోనున్నారు. గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్పై త్వరలో ఏసీబీ చార్జిషీట్ నమోదు చేయనుంది. ఇప్పటికే ఈ కేసులో నాలుగు సార్లు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కావడం గమనార్హం.
