రాహుల్ పై చర్యలు తీసుకోవాల్సిందే: ప్రహ్లాద్ జోషి

రాహుల్ పై చర్యలు తీసుకోవాల్సిందే: ప్రహ్లాద్ జోషి

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. లోక్‭సభలో ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్‭కు ప్రివిలేజ్ నోటీసులు పంపినట్లు ఆయన వెల్లడించారు. పీఎంపై చేసిన ఆరోపణలను సాక్ష్యాధారాలతో రుజువుచేయాలని కేంద్ర మంత్రులు డిమాండ్ చేశారు. ప్రధాని ప్రతిష్టను దెబ్బతీసే విధంగా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు.

అదానీ గ్రూప్ వివాదం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను కుదిపేసింది. అదానీ గ్రూప్‭లో జరిగిన అవకతవకలపై కేంద్రం స్పందించాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మోడీ పై ధ్వజమెత్తారు. లోక్‍సభలో ఫొటోలు చూపిస్తూ మోడీ, అదానీ మధ్య బంధం ఎప్పటి నుంచో కొనసాగుతోందని అన్నారు. మోడీ మద్దతుతోనే అదానీ ఎదిగారని ఆరోపించారు. అయితే ఈ విషయంపైనే ఇప్పుడు రాహుల్ గాంధీ పై చర్యలు తీసుకోవాలని లోక్‍సభ స్పీకర్, సెక్రటేరియట్‍కు బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబే, ప్రహ్లాద్ జోషి ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు లోక్ సభ స్పీకర్‭కు లేఖ పంపారు. సభను తప్పుదోవ పట్టించేలా, అవమానకరమైన, అభ్యంతకరమైన రీతిలో రాహుల్ మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే.. రాహుల్ తాను చేసిన వ్యాఖ్యలపై సాక్ష్యాలను చూపిస్తానన్నారు కాని ఎలాంటి ఆధారాలు చూపించలేదని స్పీకర్‭కు రాసిన లేఖలో నిశికాంత్ దూబే వివరించారు. ఇందులో నిజం లేనప్పటికీ ప్రధాని మోడీ పై చర్చ జరుగుతోందని ఆయన అన్నారు. సభను దిక్కరించినందుకు రాహుల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని తాను కోరుతున్నట్లు దూబే లేఖలో పేర్కొన్నారు.