కేసీఆర్​ను నమ్ముకుంటే..అవమానాలే మిగిలినయ్

కేసీఆర్​ను నమ్ముకుంటే..అవమానాలే మిగిలినయ్
  •     దశాబ్ది ఉత్సవాల్లో ఉద్యమకారులను కనీసం గౌరవించలే
  •     మా త్యాగాలకు విలువేది?  
  •     ఓయూలో 16 మందికి పదవులు.. కేయూలో ఒక్కరికేనా?  
  •     త్వరలోనే  హైదరాబాద్‍లో పోరుబాట కార్యాచరణ వెల్లడి

వరంగల్‍, వెలుగు:  ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‍ను  నమ్మితే గడిచిన తొమ్మిదేండ్లుగా తమకు అవమానాలే మిగిలాయని కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్‍ జేఏసీ ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు.  మంగళవారం కేయూ ఎస్‍డీఎల్‍సీఈ (దీక్షస్థలి) వద్ద ప్రెస్‍మీట్‍ నిర్వహించారు.  ఈ సందర్భంగా జేఏసీ నేతలు సాదు రాజేశ్‍, ఫిరోజ్‍, మంద వీరస్వామి తదితరులు మాట్లాడారు..  ఉద్యమ సమయంలో  మొదట కేయూలోనే జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమాన్ని జనాల్లోకి ఉవ్వెత్తున తీసుకెళ్లామన్నారు. ఇండ్లు, చదువులకు దూరమై  లాఠీ దెబ్బలు,  జైలు జీవితాలు,  కేసులతో కోర్టుల చుట్టూ తిరిగామన్నారు.  ఉద్యమకారులకు సముచిత గుర్తింపు  ఇవ్వాల్సిన కేసీఆర్‍ సర్కారు గడిచిన రెండు టర్మ్​ల్లో అడుగడుగునా అవమానాలకు గురి చేశారన్నారు. ఓయూలో 16 మందికిపైగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ కార్పొరేషన్‍ చైర్మన్లుగా నామినేటేడ్‍  పోస్టులు ఇస్తే.. కేయూకు మాత్రం కేవలం ఒక్కరికే అవకాశం కల్పించారన్నారు. రాజకీయ పదవులు ఉద్యోగాల్లో అన్యాయం చేశారన్నారు.  ఇదే అంశాన్ని సీఎం కేసీఆర్‍, మంత్రి కేటీఆర్‍ దృష్టికి ఎన్నోసార్లు తీసుకువెళ్లినట్లు చెప్పారు. ఈ విషయమై ప్రత్యేక చొరవ చూపాల్సిన ఉమ్మడి వరంగల్‍ జిల్లాకు చెందిన మంత్రులు, ఉద్యమకారులుగా గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. దశాబ్ది ఉత్సవాల్లో 21 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో ఉద్యమకారులకు ఒక్కరోజూ అవకాశం కల్పించకుండా అవమానపరిచారన్నారు.

ఇప్పటికైనా కేయూ ఉద్యమకారులకు సముచిత అవకాశాలు కల్పించాలన్నారు. ఉద్యమకారులను స్వాతంత్ర్య సమరయోధులుగా గుర్తించి ‘ఉద్యమకారుల బంధు’ అమలు చేయాలన్నారు.  రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీలు ఉద్యమకారుల కోసం ఏం చేస్తాయో మ్యానిఫెస్టోలో పెట్టాలని డిమాండ్‍ చేశారు.  మిగతా యూనివర్సిటీల ఉద్యమ నేతలతో కలిసి త్వరలో హైదరాబాద్‍ కేంద్రంగా మీటింగ్​ పెట్టి  పోరుబాట కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమావేశంలో జేఏసీ నేతలు కత్తెరపల్లి దామోదర్‍, ఫిరోజ్‍, చిర్ర రాజు, జోరిక రమేశ్‍, నీలం రాజ్‍కిషోర్‍, ఇడపాక విజయ్‍ ఖన్నా, సూత్రపు అనిల్‍, మేడారపు సుధాకర్‍, మాచర్ల శరత్‍చంద్ర, కొమురయ్య, మనోజ్‍, లంక గోపాల్‍, శ్రీనివాస్‍ రెడ్డి, జెట్టి రాజేందర్‍, అరూరి రంజిత్‍, మధుకర్‍ తదితరులు పాల్గొన్నారు.