భార్య చేతిలో ఏసీటీవో హత్య ..రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఆస్తి వివాదాలే కారణం 

భార్య చేతిలో ఏసీటీవో హత్య ..రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఆస్తి వివాదాలే కారణం 
  • ఈ నెల 31న ఏసీటీవో వెంకటేశ్వర్లు ఉద్యోగ విరమణ 
  • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఘటన

హుస్నాబాద్, వెలుగు : రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఆస్తి పంపకాలపై వివాదం తలెత్తడంతో భార్య చేతిలో అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (ఏసీటీవో) హత్యకు గురయ్యాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ నగర్ లో ఆదివారం రాత్రి జరిగింది. హనుమాన్ నగర్ కు చెందిన కోటి వెంకటేశ్వర్లు (60) ఆసిఫాబాద్ జిల్లాలో ఏసీటీవోగా పనిచేస్తున్నారు. ఇతడికి 35 ఏండ్ల కింద రాజమణితో వివాహమైంది. వీరికి ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు ఉన్నారు. రాజమణి మీర్జాపూర్‌‌‌‌లో ఏఎన్ఎంగా పనిచేస్తోంది.

వెంకటేశ్వర్లు 20 ఏండ్ల కింద భూమిక అనే మహిళను రెండో పెండ్లి చేసుకొని మంచిర్యాలలో ఉంటున్నాడు. భూమికకు కూడా ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు ఉన్నారు. వెంకటేశ్వర్లు అప్పుడప్పుడు హుస్నాబాద్‌‌‌‌లోని రాజమణి వద్దకు వచ్చి వెళ్తుండేవాడు. ఈ నెల 31న వెంకటేశ్వర్లు ఉద్యోగ విరమణ చేయనుండడంతో ఆయనకు వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఆస్తి పంపకాలపై మొదటి భార్య రాజమణితో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం హుస్నాబాద్‌‌‌‌లో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు.

ఇంటికి వెళ్లిన అనంతరం గొడవ తీవ్రం కావడంతో ఆగ్రహానికి గురైన రాజమణి రోకలి కర్రతో వెంకటేశ్వర్లు తలపై కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ఆయనను వెంటనే హుస్నాబాద్‌‌‌‌కు అక్కడి నుంచి కరీంనగర్‌‌‌‌లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు వెంకటేశ్వర్లు అప్పటికే చనిపోయినట్టు చెప్పారు.

మృతుడి తమ్ముడు కోటి దేవయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు హుస్నాబాద్ ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. కాగా, వెంకటేశ్వర్లును కొట్టి చంపింది భార్య రాజమణి కాదని ఆమె కొడుకేనని పలువురు అనుమానిస్తున్నారు. అతడు హైదరాబాద్‌‌‌‌లోని గాంధీ హాస్పిటల్ లో డాక్టర్‌‌‌‌గా పనిచేస్తుండగా.. కొడుకుపై కేసు నమోదైతే ఉద్యోగం పోతుందన్న భయంతోనే నేరాన్ని రాజమణి తనపై వేసుకుందన్న ప్రచారం జరుగుతోంది.