
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి హుమా ఖురేషి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె కజిన్ బ్రదర్ ఆసిఫ్ ఖురేషి దారుణ హత్యకు గురయ్యాడు. బైక్ పార్కింగ్ విషయంలో గొడవ తలెత్తడంతో గుర్తు తెలియని దుండగులు ఆసిఫ్ ఖురేషిని హత్య చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతం జంగ్‌పురా భోగల్ లేన్‌లో గురువారం (ఆగస్ట్ 8) రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇద్దరూ నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఆసిఫ్ ఇంటి గేటు ముందు ఓ వ్యక్తి బైక్ పార్కింగ్ చేశాడు. దీంతో తన ఇంటి ముందు నుంచి బైక్ తీయాలని సదరు వ్యక్తులకు ఆసిఫ్ చెప్పడంతో వివాదం మొదలైంది. వివాదం చిలికి చిలికి గాలివానలా మారడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఇద్దరు వ్యక్తులు పదునైన మారణాయుధాలతో ఆసిఫ్ ఖురేషిపై విచక్షణరహితంగా దాడి చేశారు. దుండగులు చేతిలో తీవ్రంగా గాయపడిన ఆసిఫ్‌ను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు.
ఈ ఘటనపై ఆసిఫ్ భార్య సైనాజ్ ఖురేషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు గతంలో కూడా పార్కింగ్ విషయంలో తమతో గొడవ పడ్డాడని చెప్పింది. గురువారం (ఆగస్ట్ 8) కూడా మరోసారి మా ఇంటి ముందు బైక్ పార్క్ చేశారని.. బైక్ తీయమని ఆసిఫ్ చెప్పడంతో వాగ్వాదానికి దిగారని తెలిపింది. ఆసిఫ్‌ను దుర్భాషలాడుతూ పదునైన ఆయుధాలతో దాడి చేశారని వెల్లడించింది. ఈ కేసులో ఇద్దరూ నిందితులను అరెస్ట్ చేశామని.. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.