ప్రకాశ్ రాజ్ ఎక్కడ?.. జస్ట్ ఆస్కింగ్!!

ప్రకాశ్ రాజ్ ఎక్కడ?.. జస్ట్ ఆస్కింగ్!!
  • ఎలక్షన్ ముందు కేసీఆర్ కు వీర విధేయత
  • అప్పట్లోనే రాజ్యసభకు పంపుతారని ప్రచారం
  • ఆ తర్వాత కర్నాటక రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తారని ఊహాగానాలు
  •  బీఆర్ఎస్ ఓటమితో సైలెంట్ మోడ్ లోకి
  • ఇంతకూ సారు కారులోనే ఉంటారా..? 

హైదరాబాద్: విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఎక్కడ..? తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై వీరాభిమానాన్ని చాటిన ఆయన బీఆర్ఎస్ ఓటమి పాలవగానే కనిపించకుండా పోయారనేది హాట్ టాపిక్ గా మారింది. కీలక సందర్భాల్లో కేసీఆర్ వెన్నంటి ఉన్న ఆయన ఇప్పుడు కనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. 2014లో కేసీఆర్ సీఎం అయ్యాక ప్రకాశ్ రాజ్ తొలిసారి భేటీ అయ్యారు. లంచ్ మీటింగ్ కు ప్రకాశ్ రాగా.. వీరిద్దరి మధ్య దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిగాయి.  బీజేపీకి, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేసీఆర్ తో చర్చించారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా 2018 ఏప్రిల్ లో కేసీఆర్ బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడను కలిశారు. ఈ సందర్భంలో కూడా ప్రకాశ్ రాజ్ కేసీఆర్ వెంటే ఉన్నారు.  ఆ తర్వాత  2019 లోబెంగళూరు సెంట్రల్ లోక్  సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ప్రకాశ్ రాజ్.. తర్వాత హైదరాబాద్ వచ్చి మూవీఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారు. తర్వాత గోదావరి జలాలు, కాళేశ్వరం జలాశయం నిర్మాణం కోసం ఇరు రాష్ట్రాల మధ్య చర్చల కోసం అప్పటి సీఎం కేసీఆర్ మహారాష్ట్ర వెళ్లి ఉద్దవ్ థాక్రేతో  భేటీ అయ్యారు. ఈ సందర్భంలోనూ ప్రకాశ్ రాజ్ కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. 

రాజ్యసభ టికెట్ ఆశించి భంగపాటు

2022 మే నెలలో బండ ప్రకాశ్ రాజ్యసభ సభ సభ్యత్వానికి రాజీనామా చేయించారు కేసీఆర్. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటల బర్తరఫ్​ తర్వాత స్టేట్ పాలిటిక్స్ లో గ్యాప్ ఫిల్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం కోసం ప్రకాశ్ రాజ్ తీవ్రంగా  ప్రయత్నించారు. నేరుగా ఎర్రవల్లి ఫాంహౌస్ కు వెళ్లి కేసీఆర్ తో వరుసగా రెండు రోజులు భేటీ అయ్యారు. అప్పుడు ఆయనకు రాజ్యసభ పదవి దక్కలేదు. తర్వాత కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డీ శ్రీనివాస్ పదవీకాలం పూర్తవగానే అకామిడేట్ చేస్తారని ప్రచారం జరిగినా ఫలితం లేక పోయింది.  

బీఆర్ఎస్ కర్నాటక ప్రెసిడెంట్ పోస్ట్?

టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారిన తర్వాత కేసీఆర్ పార్టీ విస్తరణపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఏపీ, కర్నాటక, మహారాష్ట్రపై ఫోకస్ పెంచారు. పార్టీ బీఆర్ఎస్ గా మారిన రోజు హైదరాబాద్ వచ్చిన కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి క్రమంగా కేసీఆర్ కు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కర్నాటక శాఖను  ఏర్పాటు చేస్తారని దానికి ప్రకాశ్ రాజ్ ను ప్రెసిడెంట్ ను చేస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. కానీ అదీ జరగలేదు. 

ఓటమి తర్వాత సైలెంట్

తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ప్రకాశ్ రాజ్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లారు. లోపభూయిష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, రాష్ట్రం అప్పుల ఊబిలో  ఉండటం, రోజుకో అక్రమం వెలుగు చూస్తుండటంతో షాక్ గురై ఏమీ మాట్లాడటం లేదా..? అన్న చర్చ మొదలైంది. కేసీఆర్ తుంటి ఎముక విరిగిన సమయంలో యశోద ఆస్పత్రికి వచ్చిన ప్రకాశ్ రాజ్.. మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రశంసల వర్షం కురిపించిన ఈ విలక్షణ నటుడు కష్ట సమయంలో కేసీఆర్ కు అండగా తన వాణిని వినిపించడం లేదన్నది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.