
ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్‌లో హీరోయిన్‌గా మెప్పించిన సమీరా రెడ్డి.. లాంగ్ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తోంది. పెళ్లి తర్వాత నటనకు దూరమైన ఆమె.. పదమూడేళ్ల విరామం తర్వాత ఓ హిందీ చిత్రంతో తిరిగి తన కెరీర్‌ను రీ స్టార్ట్ చేస్తోంది. ‘చిమ్నీ’ అనే సూపర్ నేచురల్ థ్రిల్లర్‌లో కాళీ అనే తల్లి పాత్రలో ఆమె నటిస్తోంది. ఓ దుష్ట ఆత్మ నుంచి తన కూతురుని రక్షించుకోడానికి ఓ తల్లి ఎలా పోరాడింది అనేది ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్. గగన్ పూరి దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్ ఇంప్రెస్ చేసింది. ఇక తన రీఎంట్రీ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు చెప్పింది సమీరా రెడ్డి.
తన కొడుకు ఇటీవల ‘రేస్’ సినిమా చూసి ఎందుకు నటించడం లేదని ప్రశ్నించి, ప్రోత్సహించడంతో తనకు నటనపై తిరిగి ఆసక్తి కలిగిందని ఆమె చెప్పింది. ఇన్నేళ్ల తర్వాత తిరిగి కెమెరా ముందుకు రావడం కొంత నెర్వస్‌గా అనిపించిందని, కానీ కెమెరా ఆన్ అవగానే తనలోని పాత నటి తిరిగి బయటకు వచ్చిందని సమీరా తెలిపింది. ఇక గతంలో ‘డర్నా మనా హై’ అనే హారర్ మూవీలో నటించినప్పటికీ అందులో నెరేటర్ పాత్రను పోషించింది సమీరా. అందుకే ఇదే తన ఫస్ట్ హారర్ సినిమా అని ఆమె చెబుతోంది. మరి హిందీలో రీఎంట్రీ ఇస్తున్న సమీరా.. తెలుగులోనూ నటించనుందేమో చూడాలి!