
‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంతో హీరోగానే కాక దర్శకుడిగానూ ప్రూవ్ చేసుకున్నాడు విశ్వక్‌సేన్. ఆ తర్వాత మాత్రం కొత్త దర్శకులకు అవకాశమిస్తూ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. కానీ ఇప్పుడు మరోసారి మెగాఫోన్ పట్టాడు. రీసెంట్‌గా ప్రారంభమైన కొత్త సినిమా దర్శకుడిని పక్కనపెట్టి... అతనే ఆ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే... ఈ నెల తొమ్మిదిన విశ్వక్ హీరోగా ‘దాస్‌కా ధమ్కీ’ అనే సినిమా ప్రారంభమైంది. నివేదా థామస్ హీరోయిన్. విశ్వక్ తండ్రి కరాటే రాజు ప్రొడ్యూసర్. విశ్వక్‌తో ‘పాగల్’ తీసిన నరేష్ కుప్పిలి దీనికి దర్శకుడు. ఓపెనింగ్ రోజు కూడా నరేష్ హాజరయ్యాడు. కానీ ఇటీవల షూటింగ్‌ను మొదలెట్టినప్పుడు విడుదల చేసిన పోస్టర్‌లో దర్శకుడి పేరు మారింది. ఆ స్థానంలో విశ్వక్ పేరు చేరింది. క్రియేటివ్ డిఫరెన్సెస్‌తో దర్శకుడు తప్పుకున్నాడా లేక మరేదైనా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఇక టైటిల్‌లోనూ చిన్న మార్పు చేశారు. మొదట ‘ధమ్కీ’ అనే ఇంగ్లీష్ లెటర్స్‌లో ‘యు’ ఉంది. ఇప్పుడు ఆ స్థానంలో ‘ఎ’ చేర్చారు. ఈ మార్పులు, చేర్పుల వెనుక కారణం ఏదైనా.. మొత్తానికి మరోసారి డైరెక్టర్ చెయిర్‌లో కూర్చున్నాడు విశ్వక్. మరోవైపు అతను హీరోగా నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.