సాధారణంగా బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కట్ అవ్వాలంటే ఫోన్‌కు వచ్చే ఓటీపీ (OTP) లేదా పిన్ నంబర్ తప్పనిసరి. కానీ ఇప్పుడు కనీసం ఓటీపీ కూడా అడగకుండానే సైబర్ నేరగాళ్లు ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ నటి కీర్తి (Kirti Kulhari) క్రెడిట్ కార్డ్ ఉదంతంలో కూడా ఎలాంటి ఓటీపీ షేర్ చేయకుండానే మోసం జరగడం అందరినీ కలవరపెడుతోంది. సినిమా చూస్తుండగానే నటి క్రెడిట్ కార్డు నుంచి రూ.2.43 లక్షలు మాయం అవ్వడంతో ఈ ఇన్సిడెంట్ సాధారణ జనాలకు కూడా షాక్ ఇస్తుంది. ఇంతకీ నటి క్రెడిట్ కార్డు వివరాలు ఎలా దుర్వినియోగమయ్యాయి? సైబర్ నేరగాళ్లు డబ్బును ఎలా కాజేశారు? అనే విషయాలను పరిశీలిస్తే..
అంబోలి పోలీసులకు ఫిర్యాదు
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. నటి కీర్తి కుల్హారీ ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో నివసిస్తున్నారు. జూలై 24న రాత్రి ఆమె అంధేరి వెస్ట్‌లోని ఫన్ రిపబ్లిక్ మాల్ సమీపంలోని సినీపోలిస్ మల్టీప్లెక్స్‌కు సినిమా చూసేందుకు వెళ్లారు. సినిమా చూస్తుండగా ఆమె మొబైల్‌కు బ్యాంక్ నుంచి ఓ అలర్ట్ మెసేజ్ వచ్చింది. తన క్రెడిట్ కార్డు ద్వారా ఏరోమెక్సికో ఎయిర్‌లైన్స్‌కు 2,525 అమెరికన్ డాలర్ల విదేశీ లావాదేవీ జరిగినట్లు ఆ మెసేజ్‌లో ఉండటంతో కీర్తి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
వెంటనే ఆమె బ్యాంక్ కస్టమర్ కేర్‌ను సంప్రదించి సమాచారం అందించారు. అనంతరం ఈ ఘటనపై ముంబైలోని అంబోలి పోలీసులకు ఫిర్యాదు చేయగా, గుర్తుతెలియని నిందితులపై కేసు నమోదు చేసి సైబర్ సెల్ దర్యాప్తు ప్రారంభించారు.
నాలుగు అనధికారిక లావాదేవీలు
అనుమానాస్పద విదేశీ లావాదేవీ గురించి తెలుసుకున్న వెంటనే కీర్తి కుల్హారీ బ్యాంక్ కస్టమర్ కేర్‌ను సంప్రదించింది. అనంతరం బ్యాంక్ అధికారులు క్రెడిట్ కార్డు లావాదేవీలను పరిశీలించగా, ఆమె కార్డు ద్వారా మొత్తం నాలుగు అనధికారిక లావాదేవీలు (Unauthorized Transaction) జరిగినట్లు గుర్తించారు. మరింత నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా బ్యాంక్ అధికారులు వెంటనే ఆమె క్రెడిట్ కార్డును బ్లాక్ చేశారు.
ALSO READ : టామ్ హాలండ్ మరోసారి మ్యాజిక్ చేశాడా? 'స్పైడర్-మ్యాన్
పాస్‌వర్డ్ ఎవరికీ చెప్పలేదన్న కీర్తి...
పోలీసుల విచారణలో కీర్తి కుల్హారీ తన క్రెడిట్ కార్డు పాస్‌వర్డ్‌ను ఎవరితోనూ పంచుకోలేదని స్పష్టం చేశారు. ఎలాంటి అనుమానాస్పద లింకులు, వివరాలను ఇతరులతో షేర్ చేయలేదని తెలిపారు. దీంతో సైబర్ నేరగాళ్లు టెక్నీకల్ మార్గాల ద్వారా ఆమె కార్డు లేదా మొబైల్ వివరాలను యాక్సెస్ చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మాల్‌వేర్ (Malware), స్పైవేర్ (Spyware) వంటి హానికరమైన సాఫ్ట్‌వేర్‌ల ద్వారా సమాచారం చోరీ జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రస్తుతం అంబోలి పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై FIR నమోదు చేశారు. సైబర్ సెల్ అధికారులు బ్యాంక్ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నంబర్లు, డిజిటల్ ఆధారాలు, ఇతర సాంకేతిక వివరాలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
కీర్తి కుల్హారీ సినీ కెరీర్.. నటిగా ప్రత్యేక గుర్తింపు
బాలీవుడ్ నటి కీర్తి కుల్హారీ నటిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. టెలివిజన్, వెబ్ సిరీస్‌లతో పాటు సినిమాల్లోనూ వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కీర్తి కుల్హారీ 2010లో విడుదలైన ‘ఖిచ్డీ: ది మూవీ’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘శైతాన్’ (2011) చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అనంతరం ‘పింక్’ (2016) సినిమాలో కీలక పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ‘ఇందు సర్కార్’, ‘బ్లాక్‌మెయిల్’, ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’, ‘మిషన్ మంగళ్’, ‘సూరజ్ పే మంగళ్ భారీ’, ‘సనక్’ వంటి చిత్రాల్లో నటించి తన నటనా ప్రతిభను చాటుకున్నారు.
సినిమాలతో పాటు ఓటీటీ రంగంలోనూ కీర్తి కుల్హారీ తన మార్క్ చూపించారు. ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!’, ‘క్రిమినల్ జస్టిస్’, ‘హ్యూమన్’, ‘స్కూప్’ వంటి వెబ్ సిరీస్‌లతో మంచి ఆదరణ పొందారు. ముఖ్యంగా హన్సల్ మెహతా రూపొందించిన ‘స్కూప్’ సిరీస్‌లో జర్నలిస్ట్ జాగృతి పాఠక్ పాత్రలో నటించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం నటిగా కొనసాగుతూనే నిర్మాతగానూ అడుగులు వేస్తున్న కీర్తి కుల్హారీ, తన విభిన్నమైన కథల ఎంపికతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
