ఎస్వీఆర్ మాటిచ్చిండని.. 15 ఏళ్ల తర్వాత నిలబెట్టుకుంది

ఎస్వీఆర్ మాటిచ్చిండని.. 15 ఏళ్ల తర్వాత నిలబెట్టుకుంది

తెరపై నటించేవారు చాలా మందే ఉంటారు. కానీ నటనకు నిర్వచనంగా మారే యాక్టర్స్‌ అతి కొద్ది మందే ఉంటారు. ఆ కొద్ది మందిలో శారద కచ్చితంగా ముందు వరుసలోనే ఉంటారు. బరువైన పాత్రలతో కంటతడి పెట్టించి.. పవర్‌‌ఫుల్ క్యారెక్టర్స్ తో వారెవ్వా  అనిపించి.. ఏ పాత్ర చేసినా తన ముద్ర ఉండేలా చూసుకునే శారద పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆవిడ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తొలి అడుగులు

గుంటూరు జిల్లా, తెనాలిలో జన్మించిన శారద అసలు పేరు సరస్వతి. వాళ్ల నాన్నది బంగారు నగల తయారీ వ్యాపారం. సంప్రదాయాలకు విలువిచ్చే కుటుంబం. దాంతో కట్టుబాట్లు ఎక్కువగానే ఉండేవి. శారద మద్రాసులో ఉన్న తన అమ్మమ్మ దగ్గర పెరిగారు. ఆరో యేట నుంచే భరతనాట్యం నేర్చుకున్నారు. దాంతో నాటకాల్లో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. అది మన ఇంటా వంటా లేదన్నారు. కానీ శారద తల్లికి మాత్రం కూతురి ప్రతిభను వెలుగులోకి తేవాలని ఉండేది. అందుకే అందరూ కాదన్నా పట్టించుకోకుండా కూతుర్ని నాటకాల్లోకి పంపారు. తల్లి నమ్మకాన్ని శారద నిజం చేశారు. నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అంతలో ‘కన్యాశుల్కం’ సినిమాలో బాలనటిగా కనిపించే ఛాన్స్ వచ్చింది శారదకి. అందులో నటించిన తర్వాత మళ్లీ నాటకాలపైనే దృష్టి పెట్టారు. నాగభూషణంతో కలిసి చేసిన ‘రక్తకన్నీరు’ నాటకం ఆవిడ కెరీర్‌‌ని మలుపు తిప్పింది. 

ఎన్నో మలుపులు

అప్పటికే ఇండస్ట్రీలో సరస్వతి పేరుతో చాలామంది ఉండటంతో శారద పేరుతో ఎంట్రీ ఇచ్చారామె. ఏఎన్నార్ ‘ఇద్దరు మిత్రులు’ మూవీతో చాలా మంచి పేరు వచ్చింది. ఆత్మబంధువు, దాగుడు మూతలు వంటి సినిమాల్లో నటించే అవకాశమూ వచ్చింది. అయితే మొదట తెలుగులో సైడ్ క్యారెక్టర్లే ఎక్కువ వచ్చాయి శారదకి. కొన్ని సినిమాల్లో కమెడియన్‌గా కూడా చేశారు. మేల్ కమెడియన్లకి జోడీగానూ కనిపించారు. కానీ మలయాళ సీమ మాత్రం అద్భుతమైన పాత్రలతో ఆమెకి సాదరంగా ఆహ్వానం పలికింది. దాంతో అక్కడ బిజీ అయిపోయారామె. అచ్చ తెలుగు అమ్మాయే అయినా మలయాళ నటిగానే ఎక్కువ గుర్తింపు పొందారు. ఒక మలయాళ సినిమాకి ఊర్వశి అవార్డు కూడా రావడంతో అందరి దృష్టీ ఒక్కసారిగా శారద వైపు మళ్లింది. ఈ సినిమాని తెలుగులో ‘మనుషులు మారాలి’గా తీశారు. అందులో శారద నటన చూసి మనవాళ్లు కూడా ఇంప్రెస్ అయిపోయారు. దాంతో తెలుగు సినిమాల్లో అవకాశాలు మరింతగా పెరిగాయి. దాంతో ఎన్టీఆర్, ఏఎన్నార్‌‌ లాంటి స్టార్స్‌ చిత్రాల్లోనూ ఛాన్సులు దక్కాయి. అయితే ఆమెది, శోభన్‌బాబుది హిట్‌ పెయిర్. సిసింద్రీ చిట్టిబాబు, కాలం మారింది, మానవుడు దానవుడు, శారద, జీవితం, దేవుడు చేసిన పెళ్లి, బలిపీఠం, ఇదా లోకం, కార్తీక దీపం, కోడళ్లొస్తున్నారు జాగ్రత్త, సంసారం లాంటి ఎన్నో చిత్రాల్లో వీళ్లిద్దరూ కలిసి నటించారు. ఈ రెండు భాషలే కాదు.. తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ కొన్ని సినిమాలు చేశారు శారద.

ట్రాజెడీ క్వీన్

ఎన్ని రకాల పాత్రలు చేసినా శారదకి పేరు తెచ్చి పెట్టినవి నిస్సందేహంగా ట్రాజెడీ క్యారెక్టర్లే. ప్రేమలో విఫలమవడం.. పెళ్లి విచ్ఛిన్నమవడం.. పేదరికంతో పాట్లు.. సామాజిక కట్టుబాట్లతో కష్టాలు.. కాన్సెప్ట్ ఏదైతేనేం, అన్నీ బరువైన పాత్రలే. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రకమైన సినిమాల్లో జీవించేవారామె. స్క్రీన్‌పై శారద ఏడుస్తుంటే థియేటర్లో ఉన్న ఆడవాళ్లు చీర కొంగులతో కళ్లొత్తుకునేవారట. ఎందుకంటే అది సినిమా కాదు, నిజం అని భ్రమింపజేసేలా ఉండేదామె నటన. ‘శారద’ సినిమాలో ప్రేమించినవాడు చనిపోయాడని తెలియక అతని కోసమే ఎదురు చూసే అమ్మాయి పాత్రలో ఎంతో అమాయకత్వాన్ని ప్రదర్శించారు. అసలు నిజం తెలిశాక తాను కుమిలిపోయి ప్రేక్షకుల్నీ కదిలిపోయేలా చేశారు. ఆడపిల్లకి అందం లేకపోతే కలిగే అవమానాలను ‘ఊర్వశి’లో మనసు కదిలేలా కళ్లకు కట్టారు. ఇక ‘బలిపీఠం’లో అయితే ఒకే పాత్రలో రెండు వేరియేషన్స్ చూపించాల్సి వచ్చింది. త్వరలో చనిపోతానని తెలిసినప్పుడు ఆ వేదన.. జబ్బు నుంచి బయటపడిన తర్వాత అహంకారం.. ఈ రెండింటినీ అద్భుతంగా పలికించిన ప్రతిభ శారదకే సొంతం. ఒకటీ రెండూ కాదు.. ఇలా ఎన్నో బరువైన పాత్రల్ని అవలీలగా పండించి గుండెల్ని పిండేసేవారామె.


 
నట ఊర్వశి

నేషనల్ అవార్డు అందుకోవాలని ప్రతి నటికీ ఉంటుంది. అయితే కొందరికి కెరీర్‌‌లో ఒక్కసారి కూడా ఆ అవకాశం రాదు. కానీ శారదని మూడుసార్లు జాతీయ అవార్డు వరించింది. ఇప్పుడంటే నేషనల్ అవార్డ్ అంటున్నాం కానీ మొదట్లో ఉత్తమ నటుడికి భరత్, ఉత్తమ నటికి ఊర్వశి అనే పేర్లతో అవార్డులు ఇచ్చేవారు. అది కూడా 1967లో మొదలైంది. మొదటి సంవత్సరం ఊర్వశి అవార్డును ‘రాత్ ఔర్ దిన్’ చిత్రానికి గాను నర్గీస్ దత్ అందుకున్నారు. నెక్స్ట్ ఇయర్ మలయాళ మూవీ ‘తులాభారం’కి గాను శారదకి ఇచ్చారు. ఆ తర్వాత ‘స్వయంవరం’ అనే మలయాళ మూవీకి, ‘నిమజ్జనం’ అనే తెలుగు సినిమాకి గాను మరో రెండుసార్లు ఊర్వశి అవార్డును అందుకున్నారు శారద. దాంతో ‘ఊర్వశి’ అనేది ఆమె ఇంటి పేరుగా మారిపోయింది. ‘స్వయంవరం’ సినిమాకి సంబంధించి ఓ ముఖ్యమైన విషయం... ఇందులోని ఓ సీన్‌లో నిండు గర్భిణిగా ఉన్న శారద ఒక బిందెతో నీళ్లు తీసుకెళ్లాలి. అక్కడ ఆమె ప్రదర్శించిన నటన చూసి జూరీ మెంబర్స్‌ ఫిదా అయిపోయారట. కారణం.. అప్పటికి శారద వయసు చాలా తక్కువ. అంత చిన్న వయసులో ఓ నిండు గర్భిణి ఎలా ఉంటుంది, ఎలా ప్రవర్తిస్తుంది అనేది అంత బాగా పర్‌‌ఫార్మ్ చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారట. ఏకగ్రీవంగా ఆమెకే అవార్డు ఇవ్వాలని డిసైడ్ చేశారట. శారద ఎప్పుడు కనిపించినా ఆ విషయాన్ని గుర్తు చేసేవారట.. జూరీ మెంబర్స్ లో ఒకరైన మృణాల్‌ సేన్.

సెకెండ్ ఇన్నింగ్స్‌

హీరోయిన్లుగా వెలిగిన చాలామంది మలిదశలో మంచి అవకాశాలు పొందలేరు. కానీ శారద సెకెండ్ ఇన్నింగ్స్ లో కూడా ప్రెస్టీజియస్ పాత్రలు చేశారు. తల్లి, అత్త లాంటి పాత్రలతో పాటు.. పోలీస్ ఆఫీసర్, జడ్జ్, కలెక్టర్ లాంటి క్యారెక్టర్లతో సత్తా చాటారు. పవర్‌‌ఫుల్ పాత్రలు చేయాల్సి వచ్చినప్పుడు శారదకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవారు దర్శకులు. ప్రేమఖైదీ, స్టేట్‌రౌడీ, ప్రతిధ్వని లాంటి చిత్రాల్లో యూనిఫామ్‌ వేసి అదరగొట్టారు శారద. కొండవీటి దొంగ, అగ్గిరాముడు లాంటి చిత్రాల్లో న్యాయమూర్తిగా మెప్పించారు. ఇక ‘న్యాయం కావాలి’లో లాయర్‌‌గా శారద నటనను మర్చిపోవడం అంత తేలిక కాదు. తనకి జరిగిన మోసం కలిగించిన బాధను మనసులోనే దాచుకుని, మోసపోయిన మరో అమ్మాయి కోసం పోరాడే పాత్రలో ఎంతో గొప్ప నటనను ప్రదర్శించారు. కొన్ని సినిమాల్లో కలెక్టర్‌‌ పాత్రను పోషించారు. మరికొన్ని సినిమాల్లో గడసరి అత్తగానూ కనిపించారు. ఇక ‘అంత:పురం’ లాంటి సినిమాల్లో ఆవిడ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మ రాజీనామా, మేజర్ చంద్రకాంత్, బొబ్బిలి సింహం, మెకానిక్ అల్లుడు,  సంక్రాంతి, స్టాలిన్, ఆట, యోగి, సుకుమారుడు.. ఇలా సెకెండ్ ఇన్నింగ్స్ ను కూడా చాలా సక్సెస్ ఫుల్‌గా మలచుకున్నారామె.

దేవుడిచ్చిన నాన్న కోసం..

పుట్టుకతోనే వచ్చే బంధాలు కొన్నయితే.. అనుకోకుండా ఏర్పడే అనుబంధాలు మరికొన్ని. శారద, ఎస్వీ రంగారావుల అనుబంధం అలాంటిదే. ఇద్దరూ కలిసి అభిమానవంతులు, జమీందారుగారి అమ్మాయి లాంటి చిత్రాలు చేశారు. ‘జమీందారుగారి అమ్మాయి’లో అయితే తండ్రీ కూతుళ్లుగా కనిపించారు. ఆ టైమ్‌లోనే చాలా క్లోజ్ అయ్యారట. శారదని అమ్మాయీ అని పిలిచేవారట ఎస్వీఆర్. శారద కూడా ఆయన్ని సొంత తండ్రిలా భావించేవారు. ఎస్వీఆర్‌‌కి తమిళనాడులో ఒక గార్డెన్ ఉండేది. దాన్ని బాగా డెవెలప్ చేయాలన్నా వీలు కావట్లేదని, అది నీకిచ్చేస్తాను నువ్వు చూసుకో అని శారదతో ఒకరోజు అన్నారాయన. ఆ తర్వాత కొద్ది రోజులకే ఎస్వీఆర్ చనిపోయారు. ఆయనన్న మాటని శారద మర్చిపోలేదు. పదిహేనేళ్ల తర్వాత ఆ గార్డెన్‌ని కొని డెవెలప్ చేశారు. అయితే పేరు మార్చడానికి మనసొప్పక ఎస్వీఆర్‌‌ పేరుతోనే దాన్ని ఉంచేశారట. ఆయన అప్యాయతకి, అభిమానానికీ ఆ గార్డెన్ గుర్తు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శారద. అందుకే నటిగానే కాదు.. వ్యక్తిగా కూడా శారదకి ఫుల్ మార్కులు వేస్తారంతా. రిలేషన్స్ కు విలువిస్తారని, తనవైన విలువలు పాటిస్తారని కితాబిస్తారు.


 
భక్తి ఎక్కువే!

శారదకి ఆధ్యాత్మిక భావన ఎక్కువ. అది చిన్నతనంలోనే అలవాటయ్యిందని చెబుతారామె. తెనాలిలో రెండొందల యేళ్ల నాటి చర్చ్ ఒకటి ఉంది. చిన్నతనంలో అక్కడ ఆడుకునేవారు శారద. చుట్టుపక్కల ఉండేవాళ్లంతా కూడా ఆధ్యాత్మిక చింతన, ఆచారాలను నిక్కచ్చిగా పాటించేవాళ్లు కావడంతో తనలోనూ అలాంటి ఆలోచనలు పెరిగాయని చెబుతారామె. ఇప్పటికీ ఆవిడ పురాతన దేవాలయాలకి, చర్చెస్‌కి వెళ్తుంటారు. చాలా యేళ్ల క్రితమే వెజిటేరియన్‌గానూ మారిపోయారు. గుల్బర్గా వెళ్లే దారిలో ఉన్న ఒక ఆశ్రమంలోని మహిళ చెప్పడం వల్లే ఆ నిర్ణయం తీసుకున్నారట. 

ప్రకృతి ప్రేమికురాలు
    
శారదకు చెట్లంటే చిన్నప్పటి నుంచి చాలా ప్రేమ. తమ ఇంటి ముందున్న చెట్టు కూలిపోతే మూడు రోజులు సరిగ్గా భోజనం చేయలేదామె. అంతగా వాటిని ఇష్టపడతారు. చెట్ల పెంపకంపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. అందరినీ చెట్లు నాటమని ప్రోత్సహిస్తుంటారు. ఆవిడ స్వయంగా తులసిచెట్లు నాటుతుంటారు. తులసి రుషుల వృక్షం కాబట్టి ఇరవై నాలుగ్గంటలూ ప్రాణవాయువుని ఇస్తుందని, కనీసం ఇళ్లలో కుండీల్లోనైనా తులసిని పెంచమని చెబుతారామె. 

వాటిలోనూ ప్రవేశం

ఎన్టీఆర్‌‌ నటించిన ‘కన్యాశుల్కం’తో నటిగా కెరీర్‌‌ స్టార్ట్ చేసిన శారద.. ఆయనతో కలిసి చాలా సినిమాలు చేశారు. జీవితచక్రం, సర్దారు పాపారాయుడు, జస్టిస్ చౌదరి, దానవీర శూర కర్ణ, చండశాసనుడు.. ఇలా ఎన్నో సినిమాలకు ఆయనతో కలిసి వర్క్ చేశారు. ఆ అభిమానంతోనే ఆయన పెట్టిన రాజకీయ పార్టీలో కూడా చేరారామె. తెలుగుదేశం పార్టీ తరఫున తెనాలి పార్టమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అయితే రెండేళ్లకే లోక్‌సభ రద్దయ్యింది. ఆ తర్వాత మళ్లీ పోటీ చేసినా ఓడిపోయారు. కొన్నాళ్లకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు బిజినెస్ వైపు కూడా అడుగేశారు శారద. లోటస్ పేరుతో ఓ చాక్లెట్ కంపెనీని ప్రారంభించారు. కొంతకాలం బాగానే నడిచినా తర్వాత నష్టాలు రావడంతో దాన్ని వేరేవాళ్లకు అమ్మేశారు. 

ఒకరకంగా శారదది ఒక సక్సెస్‌ఫుల్ లైఫ్‌ అని చెప్పాలి. మొదట్లో తను హీరోయిన్ ఏంటి, అసలు గ్లామరే లేదన్నవారంతా ఆమె ఎంత గొప్ప నటో గుర్తించాక బ్రహ్మరథం పట్టారు. అవార్డులూ, రివార్డులూ.. ప్రశంసలూ, సన్మానాలతో నటిగా గొప్ప స్థాయిని చూశారామె. అయితే వ్యక్తిగతంగా మాత్రం కొన్ని ఒడిదుడుకులు తప్పలేదు. హీరో చలాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు శారద. కానీ ఇద్దరికీ పొసగక విడాకులు తీసుకున్నారు. తన లైఫ్‌లో అత్యంత డిస్టర్బ్ చేసిన విషయం అదే. అయినా కుంగిపోకుండా నిలబడ్డారామె. ఆత్మస్థైర్యంతో అన్నింటినీ దాటుకుంటూ నటిగా కొనసాగారు. కొన్ని దశాబ్దాల పాటు సినీ ప్రియుల్ని అలరించారు. ప్రస్తుతం తన అన్న కుటుంబంతో కలిసి చెన్నైలో ఉంటున్నారు. ఆమె మరిన్ని సంవత్సరాలు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ.. మరొకసారి శారదగారికి జన్మదిన శుభాకాంక్షలు.