డబ్బు సంపాదనలో అదానీ రికార్డు‌‌

డబ్బు సంపాదనలో  అదానీ రికార్డు‌‌
  • 3 నెలల్లో  మస్క్‌‌ను, బెజోస్‌‌ను మించిపోయిండు
  • 50 బిలియన్ డాలర్లకు చేరిన సంపద

న్యూఢిల్లీ: ఇండియాలోని అత్యంత సంపన్నుల్లో రెండోప్లేస్​లో ఉన్న అదానీ ఇండస్ట్రీస్‌‌ బాస్‌‌ గౌతమ్‌‌ అదానీ సంపద రికార్డుస్థాయిలో పెరుగుతోంది. కేవలం మూడు నెలల్లో ఆయన సంపద మూడు రెట్లు పెరిగింది.  ప్రపంచంలోనే మిగతా బిలియనీర్ల కంటే అదానీ అత్యంత వేగంగా డబ్బు సంపాదిస్తున్న ఇండస్ట్రియలిస్టుగా రికార్డు సంపాదించారు. పోర్టులు మొదలుకొని పవర్ ప్లాంట్ల వరకు.. ఆయన చేస్తున్న బిజినెస్‌‌లు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుత సంవత్సరంలోనే అదానీ సంపద ఏకంగా 16.2 బిలియన్‌‌ డాలర్ల నుంచి 50 బిలియన్‌‌ డాలర్లకు (రూ.3.64 లక్షల కోట్లు) చేరింది. అమెజాన్‌‌ ఫౌండర్‌‌ జెఫ్‌‌ బెజోస్‌‌, టెస్లా సీఈఓ ఎలాన్‌‌ మస్క్‌‌ కూడా ఈ మూడు నెలల్లో ఇంత డబ్బు సంపాదించలేకపోయారు. అదానీ ఈ ఏడాది ‘బిగ్గెస్ట్‌‌ వెల్త్‌‌ గెయినర్‌‌’గా నిలిచారని బ్లూమ్‌‌బర్గ్‌‌ బిలియనీర్‌‌ ఇండెక్స్‌‌ పేర్కొంది. చాలా మంది బడా ఇన్వెస్టర్లు ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడమే ఇందుకు కారణమని తెలిపింది. అదానీ గ్రూపు స్టాకుల్లో ఒక్కటి మినహా మిగతావన్నీ ఈ ఏడాది 50 శాతానికిపైగా ర్యాలీ చేశాయి. ఈ  ఏడాది ‘వరల్డ్‌‌ రిచెస్ట్‌‌ పర్సన్‌‌’ రికార్డు కోసం బెజోస్‌‌, మస్క్ పోటీపడ్డ విషయం తెలిసిందే.  గౌతమ్ అదానీ సంపద గత ఏడాది రెట్టింపు అయిందని హురూన్‌‌ గ్లోబల్‌‌ రిచ్‌‌ ఇండెక్స్‌‌ ఇటీవల ప్రకటించింది. గ్లోబల్‌‌ రిచెస్ట్ పీపుల్‌‌ క్లబ్‌‌లో ఆయన 20 స్థానాలు పైకి వెళ్లాయని,  ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో 48 వ వ్యక్తిగా ఎదిగారని వెల్లడించింది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్‌‌ సంపద 128 శాతం పెరిగి 9.8 బిలియన్ డాలర్లకు  (దాదాపు రూ.72 వేల కోట్లు) చేరుకుంది.
వ్యాపారాలు సూపర్‌‌ హిట్‌‌
ఈ ఏడాదిలో అదానీ ఇప్పటి వరకు 34 బిలియన్‌‌ డాలర్లు సంపాదించగా, మనదేశంతోపాటు ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడు అంబానీ సంపద 8.1 బిలియన్లు పెరిగింది. అదానీ తన గ్రూపును వేగంగా విస్తరిస్తున్నారు. మరిన్ని పోర్టులు, ఎయిర్‌‌పోర్టులు, డేటా సెంటర్లు, కోల్‌‌మైన్స్‌‌ బిజినెస్‌‌లను చేజిక్కించుకున్నారు. టోటల్‌‌ ఎస్‌‌ఏ, వార్బర్గ్‌‌ పింకస్‌‌ వంటి ఎమ్మెన్సీలు ఆయన కంపెనీల్లో ఇన్వెస్ట్‌‌ చేస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని కార్మిచేల్‌‌ కోల్‌‌ప్రాజెక్టును కూడా దక్కించుకున్నారు. దీని నిర్మాణం వల్ల వేలాది మందికి జాబ్స్‌‌ వస్తాయని అదానీ గ్రూపు ప్రకటించినా, మైన్‌‌ వల్ల అక్కడి పర్యావరణం, సముద్ర జీవులకు తీరని నష్టం కలుగుతుందంటూ ఆందోళనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ప్రాజెక్టుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉంటే, మనదేశంలో ఒక గిగావాట్‌‌ డేటా సెంటర్‌‌ కెపాసిటినీ నిర్మించడానికి అదానీ ఎంటర్‌‌ప్రైజెస్‌‌ గత నెల ఒక ఒప్పందంపై సంతకం చేసింది.  దేశమంతటా డేటాసెంటర్లు ఏర్పాటు చేయడానికి అదానీ ఎంటర్‌‌ప్రైజెస్‌‌ అమెరికాకు చెందిన ఎడ్జ్‌‌ కనెక్స్‌‌తో కలిపి జాయింట్‌‌ వెంచర్‌‌ (జేవీ) ఏర్పాటు చేసింది.  చెన్నై, నవీ ముంబై, నోయిడా, వైజాగ్‌‌, హైదరాబాద్‌‌లలో హైపర్‌‌స్కేల్‌‌ డేటాసెంటర్లను నిర్మిస్తుంది. ఈ సైట్లలో ఇది వరకే కన్‌‌స్ట్రక్షన్‌‌ పనులు మొదలయ్యాయి.  అయితే దేశమంతటా ఎడ్జ్‌‌ డేటాసెంటర్లు కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. వీటిని నడపడానికి సోలార్‌‌ వంటి రిన్యువబుల్‌‌ ఎనర్జీని వాడుతారు. క్లౌడ్‌‌, కంటెంట్‌‌, నెట్‌‌వర్క్ ఐఓటీ, 5జీ, ఏఐ, ఎంటర్‌‌ప్రైజ్‌‌ అవసరాల కోసం డేటాసెంటర్లను ఉపయోగించుకోవచ్చు. 

ఇన్వెస్టర్ల సంపదా పెరిగింది
ఈ ఏడాది అదానీ టోటల్‌‌ గ్యాస్‌‌ లిమిటెడ్‌‌ షేరు 96 శాతం, అదానీ ఎంటర్‌‌ప్రైజెస్‌‌ షేరు 90 శాతం పెరిగాయి. అదానీ ట్రాన్స్‌‌మిషన్ లిమిటెడ్‌‌ షేరు 79 శాతం లాభపడింది. అదానీ పవర్‌‌ లిమిటెడ్‌‌, అదానీ పోర్ట్స్‌‌ అండ్‌‌ సెజ్‌‌ లిమిటెడ్‌‌ షేర్లు 52 శాతానికిపైగా లాభపడ్డాయి. అదానీ గ్రీన్‌‌ ఎనర్జీ షేరు గత ఏడాది ఏకంగా 500 శాతం పెరిగింది. దీంతో ఈ కంపెనీలలోని ఇన్వెస్టర్లు కూడా భారీగా లాభపడుతున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఇతరులకు సాధ్యం కాని బిజినెస్‌‌లలో ఆయన దూసుకెళ్తున్నారని నైనా అడ్వైజరీ సర్వీసెస్‌‌ సీఈఓ సునీల్‌‌ చంద్రమణి అన్నారు.