- గౌతమ్ అదానీకి సమన్లు జారీ చేయాలని చూస్తున్న యూఎస్ ఎస్‌ఈసీ
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు శుక్రవారం (జనవరి 23) 15శాతం వరకు పతనమయ్యాయి. అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) గౌతమ్ అదానీ, అతని బ్రదర్ కొడుకు సాగర్ అదానీపై 265 మిలియన్ డాలర్ల లంచం కేసులో సమన్లు జారీ చేయాలని చూస్తోంది. ఇందుకోసం కోర్టు అనుమతి కోరిందన్న వార్తలతో గ్రూప్ షేర్లు పడ్డాయి.
ఈసారి ఇండియా ప్రభుత్వం ద్వారా కాకుండా డైరెక్ట్‌గా సమన్లు ఇవ్వాలని ఎస్‌ఈసీ ప్రయత్నిస్తోంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు శుక్రవారం 11శాతం తగ్గి రూ.1,864 వద్ద, అదానీ పవర్ 6శాతం తగ్గి రూ.133 వద్ద, అదానీ పోర్ట్స్ 7.48శాతం తగ్గి రూ.1,308 వద్ద, అదానీ టోటల్ గ్యాస్ 6శాతం తగ్గి రూ.517 వద్ద ముగిశాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 15శాతం పతనమై రూ.772కి చేరాయి. ఈ కంపెనీకి డిసెంబర్ 2025తో ముగిసిన క్వార్టర్‌లో కేవలం రూ.5 కోట్ల నెట్ ప్రాఫిట్ మాత్రమే వచ్చింది.
2024 డిసెంబర్ క్వార్టర్‌లో వచ్చిన రూ.474 కోట్లతో పోలిస్తే 99శాతం తగ్గింది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు 12 శాతం పడిపోయి రూ.812 వద్ద ముగియగా, అంబుజా సిమెంట్స్, సంగీ ఇండస్ట్రీస్, ఎన్‌డీటీవీ, ఏసీసీ కూడా నష్టాల్లో క్లోజయ్యాయి. యూఎస్ ఎస్‌ఈసీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టీస్ (డీఓజే) చేసిన ఆరోపణలు ఆధారరహితమని, అన్ని చట్టాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని అదానీ గ్రూప్ తెలిపింది.
అదానీ చేతికి ఐఏఎన్‌ఎస్
గౌతమ్ అదానీ గ్రూప్ ఐఏఎన్‌ఎస్ న్యూస్ ఏజెన్సీపై పూర్తి నియంత్రణ సాధించింది. ఈ గ్రూప్ సబ్సిడరీ ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ లిమిటెడ్ జనవరి 21, 2026న షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ ద్వారా మిగిలిన 24శాతం వాటాను కొనుగోలు చేసింది. దీంతో ఐఏఎన్‌ఎస్ పూర్తిగా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన సబ్సిడరీగా మారనుంది. అదానీ గ్రూప్ 2023లో కొన్న 50.5శాతం వాటాను 2024లో 76శాతానికి పెంచుకుంది. తాజాగా మరో 24 శాతం వాటాను పొందింది. దీంతో మీడియా రంగంలో తన పొజిషన్‌ను మరింత బలపరచుకుంది.
