మేడిగడ్డ బ్యారేజీలో ఏడీసీపీ సర్వే

మేడిగడ్డ బ్యారేజీలో ఏడీసీపీ సర్వే

మహదేవపూర్,వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులోని భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం వద్ద మేడిగడ్డ బ్యారేజీలో బుధవారం సీడబ్ల్యూపీఆర్ఎస్ పూనే టీం గోదావరిలో ఏడీసీపీ( ఎకౌస్టిక్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్) సర్వే చేసింది. ప్రాజెక్ట్ లో కుంగిన ఏడో బ్లాక్ నుంచే ప్రవాహం వెళ్తుండడంతో అక్కడే సర్వే చేయడంతో  ప్రత్యేకతను సంతరించుకుంది. సాధారణంగా సర్వేకు నదినీటిలోకి ధ్వని తరంగాలను పంపించి తిరిగి పరికరానికి చేరుకొన్నాక నీటి వేగం, దిశను అంచనా వేస్తారు.  

కానీ ఈ సర్వేకు బోట్ కు ఒక సైడ్ పరికరం కట్టి నదిలో  డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ లో నీటి ప్రవాహ వేగాన్ని కొలిచారు.  నది రెండు ఒడ్డులవైపు ఉన్న ప్రొఫైల్ ను , రివర్ బెడ్ మార్పులను ట్రాక్ చేసి, కోత కారణంగా ఎలా మార్పు చెందుతున్నాయో తెలుస్తుందని ఎక్స్ పర్ట్స్ తెలిపారు. వారం కింద అన్నారం బ్యారేజీ లో సర్వే చేయగా.. ప్రవాహ వేగం తక్కువగా ఉండడంతో నాటు పడవలను వాడారు.  ప్రస్తుత సర్వేలో మేడిగడ్డ బ్యారేజీ లో ప్రాణహిత నది నుంచి ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండడంతో  లక్నవరం నుంచి టూరిజం బోట్ ను తెప్పించి వినియోగించారు. ఈ సర్వే లో ఇరిగేషన్ ఆఫీసర్లు పాల్గొన్నారు.