జగన్ కు లిక్కర్ స్కాం గురించి తెలిసి ఉండదు: విజయసాయి రెడ్డి

జగన్ కు లిక్కర్ స్కాం గురించి తెలిసి ఉండదు: విజయసాయి రెడ్డి

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. జగన్ కు లిక్కర్ స్కాం గురించి తెలిసి ఉండదని... ఒకవేళ తెలిస్తే జగన్ ఉరుకునేవారు కాదని అన్నారు.విచారణలో భాగంగా అధికారులు లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అన్నదే మొదటి ప్రశ్నగా అడిగారని అన్నారు. తాను జగన్‌ ప్రభుత్వంలో నెంబర్‌ 2 స్థానంలో ఉన్నప్పటికీ ఈ వ్యవహారం గురించి తెలియదనడం సరికాదా అని ప్రశ్నించారని... జగన్ ఉన్నప్పుడు నెంబర్‌ 2 అనే స్థానం ఉండదని అన్నారు. 

అయితే జగన్ కోటరీలో నన్నే నెంబర్‌ 2గా ప్రచారం చేశారని... కేసుల విషయంలో తనను నెంబర్‌–2గా చూపారు కానీ లాభాల విషయంలో మాత్రం నేను ఎప్పుడూ ఉండలేదని అన్నారు విజయసాయి రెడ్డి.అధికారంలోకి వచ్చే వరకు సుమారు ఏడాది పాటు జగన్ తనకు నెంబర్‌–2 స్థానం ఇచ్చారని, తన హృదయంలోనూ అదే స్థానం కల్పించారని తెలిపారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తనను పక్కన పెట్టారని ఆరోపించారు. “2020 నుంచే నన్ను సైడ్ చేశారు. వెన్నుపోటు పొడుస్తాననే అనుమానంతో కోటరీ మనుషులు కుట్రలు చేసి నన్ను దూరం చేశారని అన్నారు.

కోటరీ వేధింపులు తట్టుకోలేక పార్టీ నుంచి బయటకు వచ్చా

పార్టీ నుంచి ఎందుకు వెళ్లిపోయారన్న ప్రశ్నకు స్పందిస్తూ, “జగన్ హృదయంలో నేను లేకపోవడమే కారణం. కోటరీ వేధింపులు భరించలేక పార్టీ నుంచి బయటకు వచ్చాను. లిక్కర్ స్కామ్ కారణంగా కాదు” అని స్పష్టం చేశారు. వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు వేసి చెబుతున్నానని, తాను డబ్బుకు లొంగలేదని, ఎప్పటికీ లొంగనని వ్యాఖ్యానించారు.

జనవరి 25 తర్వాత రాజకీయ రంగప్రవేశం

జనవరి 25 తర్వాత తాను మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు విజయసాయి రెడ్డి. అయితే ఏ రాజకీయ పార్టీలో చేరబోనని, తన రాజకీయ భవిష్యత్తును తానే నిర్ణయించుకుంటానని చెప్పారు. జగన్ మళ్లీ పార్టీకి ఆహ్వానిస్తే మాత్రం ఆలోచిస్తానని తెలిపారు.

కోటరీ మారకపోతే జగన్‌కు భవిష్యత్తు లేదు

కోటరీ వ్యవస్థ ఇలాగే కొనసాగితే జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. కూటమిని విడగొట్టే రాజకీయ వ్యూహం లేకపోవడం వల్లే జగన్ నష్టపోయారని, కోటరీలోని వ్యక్తులు ఆయనను మిస్‌గైడ్ చేస్తున్నారని అన్నారు.

అప్రూవర్‌గా మారను

దేహంలో ప్రాణం ఉన్నంత వరకు అప్రూవర్‌గా మారనని స్పష్టం చేశారు విజయసాయి రెడ్డి. లిక్కర్ స్కామ్‌లో నేను లేను కాబట్టే నన్ను అరెస్ట్ చేయలేదని... 44 మంది నిందితుల్లో ఎంత మందిని అరెస్ట్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు విజయసాయి రెడ్డి.