పోక్సో కేసుతో కేటీఆర్ దుష్ట రాజకీయాలు : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

పోక్సో కేసుతో కేటీఆర్ దుష్ట రాజకీయాలు : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
  • బీజేపీతో పొత్తును బండి అడ్డుకుంటున్నందుకే ఆయన్ను టార్గెట్ చేశారని అనుమానం: అద్దంకి
  • ఫ్యూచర్ సిటీపై కేటీఆర్, హరీశ్​ది హాఫ్ నాలెడ్జ్ అని విమర్శ

న్యూఢిల్లీ, వెలుగు: బండి భగీరథ్ ఎపిసోడ్ లో మైనర్ బాలిక అంశంతో కేటీఆర్ దుష్ట రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ అవినీతి, అక్రమాల చిట్టా బీజేపీ దగ్గర ఉన్నందునే, ఆ పార్టీ నేతలు బీజేపీపై మాట్లాడటానికి భయపడుతున్నారన్నారు. కానీ, బండి సంజయ్ బీజేపీ(ఎన్డీఏ)తో పొత్తును అడ్డుకున్నారనే ఆయ‌‌న‌‌పై కుట్రలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భ‌‌వ‌‌న్ గురజాడ హాల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తలాతోకలేని వ్యాఖ్యలతో కేటీఆర్.. కల్వకుంట్ల తిక్కల్ రావుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘కేటీఆర్ దిగజారి మాట్లాడుతున్నారు. తెలంగాణ ఆయ‌‌న్ను భరించలేకపోతుంది. ప్రజలు బీఆర్ఎస్ కు అవకాశం ఇస్తే... కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్, సంతోష్... ఇలా వాళ్లింట్లో అందరూ సీఎంలుగా ఫీలయ్యారు. కల్వకుంట్ల కుటుంబం.. తెలంగాణను పట్టి పీడిస్తున్న జలగలు, ఆ ఫ్యామిలీతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’అని పిలుపునిచ్చారు.

హరీశ్ బీజేపీతో టచ్​లో ఉన్నరు

బీజేపీ, బీఆర్ఎస్​ది వాలైంటెన్స్ లవ్ స్టోరీ అని దయాకర్ ఎద్దేవా చేశారు. ‘కమలం పువ్వుతో బీజేపీ కొడితే.. గులా బీ పువ్వుతో బీఆర్ఎస్ నేతలు ప్రేమ కబుర్లు చెప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై బీజేపీ ప్రేమను కురిపిస్తే... పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ లవ్ స్టోరీ నడిపింది’అని కామెంట్ చేశారు. సొంత పార్టీ లోనే కేటీఆర్ ను సీఎం అభ్యర్థిగా ఆయన బావ హరీశ్ రావు ఒప్పుకోవడం లేదన్నారు.

ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో హరీశ్ ను కనీసం ఉండనిచ్చే పరిస్థితి లేదని, దీంతో ఆయన బీజేపీతో టచ్ లోకి వెళ్లినట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఫ్యూచర్ సిటీపై కేటీఆర్, హరీశ్ ది హాఫ్ నాలెడ్జ్ అని విమర్శించారు. ఫార్మా సిటీ పేరిట భూదాన్, ముచ్చర్ల భూములను గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఎలా గుంజుకుందో ప్రజలందరికీ తెలుసన్నారు. డీఎస్ కొడుకుగా పుట్టకపోతే ఎంపీ అర్వింద్ కు అసలు రాజకీయ అడ్రస్సే ఉండేది కాదన్నారు.