- విప్‌లు అద్దంకి, బల్మూరి ఫైర్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అధికారంలో ఉన్నప్పుడే కాకుండా, ప్రతిపక్షంలో ఉండి కూడా బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. శనివారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మరో విప్ బల్మూరి వెంకట్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. హరీశ్ రావు ఏదో ఒక అంశంపై మాట్లాడటం, ఆ తర్వాత సంబంధిత వ్యక్తులను భయపెట్టి వసూళ్లకు పాల్పడటం పనిగా పెట్టుకున్నారని అద్దంకి ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో ఇప్పుడు హరీశ్ రావు ట్యాక్స్ కట్టే పరిస్థితి ఉందన్నారు. అసెంబ్లీలో క్రషర్ల అంశంపై మాట్లాడి.. వాటి యజమానులను హరీశ్ బ్లాక్ మెయిల్ చేశాడని ఆరోపించారు. క్రషర్ యజమానులకు, హరీశ్ రావుకు ఎమ్మెల్సీ నవీన్ రావు మధ్యవర్తిగా వ్యవహరించి కోటి రూపాయల చొప్పున వసూలు చేశారని ఆరోపించారు. హ్యామ్ రోడ్లపై మాట్లాడి సంబంధిత కాంట్రాక్టర్లను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. దమ్ముంటే వీటిపై చర్చకు రావాలని హరీశ్ రావుకు సవాల్ విసిరారు. బల్మూరి వెంకట్ మాట్లాడుతూ...బావా, బామ్మర్ధి పోటీపడి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారని ఆరోపించారు.
