సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న చాలా మంది కల గూగుల్‌లో ఉద్యోగం సంపాదించాలి అన్నదే. గూగుల్ అనగానే మన బుర్రలోకి వచ్చే మొదటి ఆలోచనలు.. "అబ్బా కోడింగ్ రావాలి, ఐఐటీ ఐఐఎంలో చదివి ఉండాలి, మనం పక్కా పర్ఫెక్ట్ గా ఉండాలి". అయితే ఇవన్నీ కేవలం అపోహలేనని గూగుల్ ఉద్యోగిని నేహా శర్మ ఇన్ స్టాగ్రామ్‌లో క్లారిటీ ఇచ్చారు. ఆమె షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో గూగుల్ హైరింగ్ గురించి ఉన్న టాప్ మిత్స్ ను ఆమె ఒక్కొక్కటిగా బ్రేక్ చేసారు.
చాలామంది గూగుల్ అంటే కేవలం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకే అనుకుంటారు. కానీ నేహా శర్మ చెబుతున్న దాని ప్రకారం.. గూగుల్‌లో టెక్నాలజీతో సంబంధం లేని రోల్స్ బోలెడు ఉన్నాయి. స్ట్రాటజీ, మార్కెటింగ్, సేల్స్ ఆపరేషన్స్ వంటి విభాగాల్లో గూగుల్ భారీగా రిక్రూట్మెంట్స్ చేపడుతుంది. "అందరూ కోడింగ్ చేసుకుంటూ కూర్చుంటే, మరి మేము తయారు చేసిన ప్రోడక్ట్స్‌ను ఎవరు అమ్ముతారు?" అంటూ ఆమె వేసిన ప్రశ్న నెటిజన్లను ఆలోచింపజేస్తోంది. అంటే కోడింగ్ రాకపోయినా మార్కెటింగ్ లేదా సేల్స్ స్కిల్స్ ఉంటే గూగుల్ తలుపులు మీ కోసం తెరిచే ఉంటాయి.
డిగ్రీ ముఖ్యం కాదు.. స్కిల్స్
ఇక అందరినీ వేధించే మరో పెద్ద అపోహ కాలేజ్ ట్యాగ్. అదేనండీ ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్లకు మాత్రమే గూగుల్ ప్రాధాన్యత ఇస్తుందని చాలామంది అనుకుంటుంటారు. తాము పనిచేస్తున్న టీమ్‌లో ఐఐటీలో చదవని వారు చాలా మంది ఉన్నారని నేహా చెప్పారు. వాళ్లు అద్భుతమైన అవుట్‌పుట్ ఇస్తున్నారని పేర్కొన్నారు. గూగుల్ డిగ్రీ, కాలేజ్ పేరు కంటే మీ పనితీరు, నైపుణ్యాలకే ఎక్కువ విలువ ఇస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఇంటర్వ్యూలో పర్ఫెక్ట్ సమాధానాలు చెప్పే వారి కంటే.. క్లిష్ట పరిస్థితుల్లో సమస్యలను స్మార్ట్‌గా ఎలా పరిష్కరిస్తారనే విషయాన్నే గూగుల్ గుర్తిస్తుందని పేర్కొన్నారు.
►ALSO READ | CNG vs హైబ్రిడ్ vs ఎలక్ట్రిక్: ఏ కారు కొంటే లాభం..? ఏది బెస్ట్..?
గూగుల్ లాంటి పెద్ద టెక్ కంపెనీల్లో చేరాలంటే మీరు పర్ఫెక్ట్ గా ఉండనక్కర్లేదు.. క్విక్ లెర్నింగ్, సమస్యలను పరిష్కరించే తెలివితేటలు ఉంటే చాలు. ఈ వీడియో చూసినవాళ్లు గూగుల్ హైరింగ్ ప్రాసెస్‌ను ఇంత సింపుల్‌గా చెప్పినందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సో, కాలేజ్ ట్యాగ్ లేదని బాధపడకుండా మీ స్కిల్స్ పెంచుకుంటే గూగుల్‌లో డ్రీమ్ నెరవేర్చుకోవచ్చు.
