హైదరాబాద్: ఐపీఎల్ 19లో బిజీ బిజీగా గడుపుతోన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ ఆధ్యాత్మిక బాటపట్టాడు. శనివారం (మే 2) హైదరాబాద్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించాడు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. అంతకుముందు ఆలయ అర్చకులు అభిషేక్ శర్మకు ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల తర్వాత తీర్థప్రసాదాలు అందజేసి, వేదాశీర్వచనం ఇచ్చారు. అభిషేక్ శర్మను చూసేందుకు ఆలయానికి వచ్చిన భక్తులు పోటీపడ్డారు. కొందరు భక్తులతో అభి ఫొటోలు దిగి సందడి చేశాడు. అభి కర్మన్ ఘాట్ ఆలయాన్ని సందర్శించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ బిజీ షెడ్యూల్ లో కూడా సంప్రదాయాలను గౌరవిస్తూ దైవ భక్తి చాటుకోవడం పట్ల అభిషేక్ శర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
సెంటిమెంట్ రిపీటైతే చుక్కలే:
ఐపీఎల్ 19లో భాగంగా ఆదివారం (మే 3) హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్, కేకేఆర్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచుకు ముందు శనివారం (మే 2) హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ కర్మాన్‌ఘాట్ హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్నాడు. గతంలో కూడా హైదరాబాద్‌లో మ్యాచులకు ముందు రోజు నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ, పెద్దమ్మ తల్లి దేవాలయాలను అభిషేక్ దర్శించుకున్నాడు. ఆ తర్వాత మ్యాచుల్లో ఈ యువ ఓపెనర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
►ALSO READ | వికెట్ తీసి వైభవ్ మీదకు దూసుకెళ్లిన కైల్ జమీసన్...ఢిల్లీ పేసర్ కు బిగ్ షాక్...
తాజాగా కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు రోజు కూడా అభి కర్మాన్‌ఘాట్ అంజన్న ఆలయాన్ని దర్శించుకోవడంతో కేకేఆర్పైన కాటేరమ్మ కొడుకు భారీ ఇన్నింగ్స్ ఆడటం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. అభి సెంటిమెంట్ రిపీట్ అయితే కేకేఆర్ కు చుక్కలే అంటున్నారు హైదరాబాద్ అభిమానులు.
మరీ కేకేఆర్ పై అభిషేక్ శర్మ ఏ విధంగా ఆడుతాడో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. ఈ సీజన్ లో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచులు ఆడిన హైదరాబాద్ ఆరు విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆదివారం (మే 3) సొంతగడ్డపై కేకేఆర్‌ను చిత్తు చేసి ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది హైదరాబాద్.
