చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలి

చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలి

పోరాటాల చరిత్ర కలిగిన చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజనుగా ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు మాలమహానాడు జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు అద్దంకి దయాకర్. అడగని ప్రాంతాలను రెవెన్యూ డివిజన్లుగా ప్రకటించడం.. ప్రజలు కోరుతున్న ప్రాంతాన్ని మాత్రం సీఎం కేసీఆర్ రెవెన్యూ డివిజన్ గా ప్రకటించకపోవడం దారుణమన్నారు. చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజనుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న దయాకర్.. ఆ తర్వాత మాట్లాడారు.

సీఎం సొంత జిల్లాలో ఉన్న చేర్యాల ప్రాంతాన్ని పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు అద్దంకి దయాకర్. జనం కోసం కొట్లాడిన ఏ ఒక్కరూ స్వార్థ రాజకీయాలు చేసిన చరిత్ర లేదన్నారు. ప్రజల కోసం కొట్లాడిన జయశంకర్ సార్ ఏ ఒక్క పదవిని పొందలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆత్మబలిదానాలు ఎక్కువయ్యాయన్నారు. నిజాం రజాకార్లకు ఎదురొడ్డి పోరాడి 128మంది మరణించిన చరిత్ర కలిగిన వీర భైరాన్ పల్లిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజనుగా ఏర్పాటుకు చేసే పోరాటంలో తాను ముందుంటాని స్పష్టం చేశారు. చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు రాబోయే రోజుల్లో జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.