కాంగ్రెస్ పార్టీకి డిసెంబర్ ఒక మిరాకిల్ మంత్: సీఎం రేవంత్

కాంగ్రెస్ పార్టీకి డిసెంబర్ ఒక మిరాకిల్ మంత్: సీఎం రేవంత్

హైదరాబాద్: క్రైస్తవుల మాదిరిగానే కాంగ్రెస్ పార్టీకి డిసెంబర్ నెల కీలకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ డిసెంబర్‎లోనే జన్మించారని.. ఇదే డిసెంబర్ నెలలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే ఇందులో సోనియా గాంధీ పాత్ర, త్యాగం ఉందన్నారు. రాజకీయంగా భారీ మూల్యం చెల్లించి, ఏపీలో పార్టీకి నష్టం జరిగినప్పటికీ సోనియా గాంధీ తెలంగాణను ప్రసాదించారని పేర్కొన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి జరుపుకునే పండుగ క్రిస్మస్ అని.. ద్వేషించే వారిని కూడా ప్రేమించే గుణాన్ని ఏసు ప్రభువు స్ఫూర్తిగా నింపారని అన్నారు. ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించడానికి ఏసు ప్రభువు జన్మించారని.. జీసస్ బోధనల స్ఫూర్తితో మా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. శాంతిని కాపాడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. 

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం (డిసెంబర్ 20) ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. పేదవాడి ఆకలి తీర్చాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రత చట్టం తెచ్చిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి నెలకు 6 కిలోల సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. ఉచిత విద్యుత్ పథకం ద్వారా పేదల ఇళ్లలో వెలుగులు నింపామన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో వ్యవసాయంపై రూ.1.04 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు.