ముందే స్లాట్‍ బుక్‍ చేసుకున్నా.. అదనపు చార్జీల బాదుడు

ముందే స్లాట్‍ బుక్‍ చేసుకున్నా.. అదనపు చార్జీల బాదుడు

వరంగల్‍ రూరల్‍/ఆత్మకూర్‍, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా భూములు, ఇళ్లు, ప్లాట్లు, అపార్ట్​మెంట్ల మార్కెట్‍ విలువ, రిజిస్ట్రేషన్​చార్జీలు పెంచడంతో.. ఇండ్లు, జాగాలు కొనేటోళ్లపై డబుల్​భారం పడుతోంది. గురువారం నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వచ్చాయి. ఆస్తి విలువ, రిజిస్ట్రేషన్​చార్జీలు పెంచుతారని ముందే తెలిసి ఎప్పుడో చలాన్లు కట్టి స్లాట్​బుక్​చేసుకున్నవాళ్లనూ సర్కారు వదల్లేదు. పెరిగిన అదనపు చార్జీలు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పడంతో పబ్లిక్​అవాక్కయ్యారు. ఇది సర్కారు తమను మోసం చేయడమేనని మండిపడ్డారు. 

స్లాట్‍ బుక్‍ చేసుకున్నోళ్లు గరంగరం

 పెరిగిన ఆస్తి విలువు, చార్జీలను చూసి కొనుగోలుదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే స్లాట్‍ బుక్‍ చేసుకున్నవాళ్లు సైతం పెరిగిన రేట్లకు అనుగుణంగా అదనపు చార్జీలు కట్టాల్సిందేనని గవర్నమెంట్‍ ఆర్డర్‍ వేసింది. దీనికోసం ధరణి వెబ్‍సైట్​లో ‘అడిషనల్‍ పేమెంట్​ఫర్‍ ఆల్రెడీ బుక్డ్’ పేరుతో ఆప్షన్‍ పెట్టింది. రిజిస్ట్రేషన్‍ కోసం వచ్చే జనాలు ఇప్పుడు ఆ అదనపు చార్జీలు మళ్లీ కడితేనే సబ్‍ రిజిస్ట్రార్‍కు వారి వివరాలు కనిపిస్తున్నాయి. కొత్త రేట్లు, చార్జీలు అమల్లోకి రావడానికి 20, 30 రోజుల ముందే వేలాదిమంది రిజిస్ట్రేషన్‍ కోసం బ్యాంక్‍ చలానా కట్టి స్లాట్‍ బుక్‍ చేసుకున్నారు. భూమి అమ్మే వ్యక్తి అందుబాటులో లేడనో, మంచి రోజు చూసుకుని రిజిస్ట్రేషన్‍ చేసుకుందామనో ఆగారు. పనులు వదులుకుని చలానా, స్లాట్‍ బుకింగ్‍ వర్క్స్ గతంలోనే కంప్లీట్‍ చేసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ డబుల్‍ వర్క్, డబుల్‍ మనీ ఖర్చు కావడంతో గరం అవుతున్నారు.