- బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
హైదరాబాద్, వెలుగు : ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ కేవలం ఒక జిల్లాకు సంబంధించినది కాదని, ఉత్తర తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇది బెంచ్ మార్క్ అని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు కేవలం హైదరాబాద్‌కే పరిమితమయ్యాయని.. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆదిలాబాద్ రూపురేఖలు మారబోతున్నాయని ఆయన వెల్లడించారు.
సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడారు. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం దేశంలోనే అత్యంత వెనుకబడ్డ జిల్లాగా ఉన్న ఆదిలాబాద్, త్వరలోనే గ్లోబల్ మ్యాప్‌లోకి ఎక్కబోతోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం సుమారు రూ.5,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,278 కోట్లు, రక్షణ శాఖ మరో రూ.3 వేల కోట్లు ఇవ్వనున్నదని చెప్పారు.
హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 2,200 ఎకరాల భూసేకరణ పూర్తికాగా, మరో 6 వేల ఎకరాల క్లియరెన్స్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని, త్వరలోనే ఇది నేషనల్ లాజిస్టిక్ హబ్‌గా, కార్గో టెర్మినల్‌గా రూపాంతరం చెందుతుందని పేర్కొన్నారు. 2014లోనే కేంద్రం చొరవ చూపినా, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పదికి పైగా ఉత్తరాలు రాసినా స్పందించలేదని ఆయన
విమర్శించారు.
