హైదరాబాద్: ఏడాదిలోగా ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు పనులు ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ అభివృద్ధి కోసమే ఎయిర్ పోర్టు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎర్ర బస్సే కాదు.. ఎయిర్ బస్సును కూడా ఆదిలాబాద్‌కు తీసుకొస్తామన్నారు. ఎయిర్ పోర్టు వస్తే ఆదిలాబాద్‌కు పరిశ్రమలు వస్తాయని పేర్కొన్నారు.
ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా గురువారం (డిసెంబర్ 4) సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి త్వరలోనే ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆదిలాబాద్‌లో సిమెంట్ కంపెనీ ప్రారంభిస్తామని అన్నారు.
ఆదిలాబాద్‌లో అపారమైన సున్నపు రాయి నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఆదిలాబాద్‌కు యూనివర్శిటీ ఇచ్చే బాధ్యత నాదని.. ఎక్కడో కట్టాలో స్థానిక నేతలు చర్చించుకుని రావాలని సూచించారు. ఇంద్రవెళ్లిలో యూనివర్శిటీ కడితే బాగుంటుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. చనాకా కొరట ప్రాజెక్టును త్వరలోనే జాతికి అంకిస్తాం చేస్తామని తెలిపారు.
