ఆదిలాబాద్ జిల్లాలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రారంభానికి ముందే శిథిలావస్థకు..

ఆదిలాబాద్  జిల్లాలోని డబుల్  బెడ్రూమ్  ఇండ్లు  ప్రారంభానికి ముందే శిథిలావస్థకు..

గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్  బెడ్రూమ్  ఇండ్లు ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరుకున్నాయి. నాసిరకం నిర్మాణం, నిర్వహణ లోపంతో వాటిని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. గోడలు పెచ్చులు ఊడి, బీటలు వారుతున్నాయి. కిటికీలు, తలుపులు పగలగొట్టగా, డ్రైనేజీ పైపులు పగిలిపోయాయి. గత ప్రభుత్వం ఆదిలాబాద్  జిల్లాలోని కేఆర్కే కాలనీతో పాటు మావలలో 982 డబుల్​ ఇండ్లు కట్టించింది. ఎన్నికలకు ఆరు నెలల ముందు అధికారులు లక్కీ డ్రా నిర్వహించి 618 మందిని ఎంపిక చేశారు. వాటిలో కనీస మౌలిక వసతులు లేకపోవడంతో ఎవరూ వాటిలోకి వెళ్లలేదు. కాగా, ప్రస్తుత ప్రభుత్వం ఇళ్లల్లో ఉండని వారికి నోటీసులు ఇచ్చి, అర్హులైన పేదలను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. 

అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి డబుల్  ఇండ్లను పంపిణీ చేయాలని ఆదేశించడంతో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఇదిలాఉంటే నాలుగైదు ఏండ్ల కింద పూర్తయిన ఇండ్ల కేటాయింపు ఆలస్యం కావడం, సౌలతులు లేకపోవడంతో లబ్ధిదారులు వాటిలో ఉండడం లేదు. దీంతో వైరింగ్‌‌‌‌‌‌‌‌లు, ఇనుప కిటికీలు ఎత్తుకెళ్లారు. డ్రైనేజీ సిస్టమ్‌‌‌‌‌‌‌‌  పూర్తిగా ధ్వంసమైందని, రోడ్డు, నీటి వసతి లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. పనులు నాసిరకంగా జరగడంతో పెచ్చులు ఊడిపోతున్నాయని వాపోతున్నారు.- వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్