ఆదివాసీలను బీజేపీ వనవాసీలుగా చూస్తోంది : రాహుల్ గాంధీ

ఆదివాసీలను బీజేపీ వనవాసీలుగా చూస్తోంది : రాహుల్ గాంధీ

ఆదివాసీలను బీజేపీ వనవాసీలుగా చూస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. గుజరాత్ ఎన్నికల్లో భాగంగా సూరత్ లో నిర్వహించిన ప్రచారంలో రాహుల్ పాల్గొన్నారు. గిరిజనులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. ఆదివాసీలే దేశానికి తొలి యజమానులన్నారు. జల్, జంగిల్, జమీన్ తోనే ఆదివాసీల జీవన విధానం ముడిపడి ఉందని తెలిపారు. ఆదివాసీల భూములను లాక్కుని ఇద్దరు, ముగ్గురు వ్యాపారవేత్తలకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. పట్టణాల్లో ఆదివాసీలు నివసించడం, వారికి విద్య, వైద్యం అందడం బీజేపీకి ఇష్టం లేదని రాహుల్ అన్నారు. అడవులను అమ్మి గిరిజనులను బీజేపీ నిరాశ్రయులను చేయాలనుకుంటోందని రాహుల్ ఆరోపించారు. ‘మీ పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు అవుతారు. ఇంగ్లీషులో మాట్లాడండి’ అని రాహుల్ వారికి సూచించారు.  

182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1, 5వ తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. గుజరాత్‌లో గత 27 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ.. ఏడోసారి కూడా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్, ఆప్ బీజేపీని గద్దె దించాలనే పట్టుదలతో ఉన్నాయి.