నేవీ చీఫ్​గా డీకే త్రిపాఠి

నేవీ చీఫ్​గా డీకే త్రిపాఠి

న్యూఢిల్లీ: భారత 26వ నావికా దళాధిపతి (నేవీ చీఫ్​)గా అడ్మిరల్​ దినేశ్​కుమార్​ త్రిపాఠి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత చీఫ్​ ఆర్​ హరికుమార్​ పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో డీకే త్రిపాఠి ఈ బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని సౌత్​బ్లాక్​లో ఈ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది.  ఈ  సందర్భంగా త్రిపాఠి మాట్లాడుతూ.. ఇండియన్​ నేవీ అన్నివిధాలా పటిష్టంగా ఉన్నదని చెప్పారు. 

ఏండ్లుగా ఇందుకు కృషిచేసిన నేవీ మాజీ చీఫ్​లకు కృతజ్ఞతలు తెలిపారు. శత్రువులను ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని నావికా దళానికి   పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర్​ భారత్​, వికసిత్​ భారత్​లక్ష్యాలను చేరుకునేందుకు నేవీని బలోపేతం చేస్తానని చెప్పారు. నేవీలో మానవ వనరులకు అత్యంత ప్రాధాన్యతనిస్తానని, నావికాదళంలో పనిచేసేవారందరికీ అత్యుత్తమ శిక్షణతోపాటు అధునాతన సాంకేతికతతో కూడిన ఆయుధాలు అందజేస్తానని, అడ్మినిస్ట్రేటివ్​ సపోర్ట్​తోపాటు ప్రొఫెషనల్​ ఎన్విరాన్​మెంట్​ కల్పిస్తానని తెలిపారు.

తల్లి పాదాలకు నమస్కరించి బాధ్యతలు

నేవీ చీఫ్​గా బాధ్యతలు స్వీకరించే ముందు త్రిపాఠి తన తల్లిపాదాలకు నమస్కరించారు. జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద అమరులకు నివాళులర్పించారు.  కాగా, డీకే త్రిపాఠి ఇప్పటివరకూ ఇండియన్​ నేవీ వైస్​ చీఫ్​గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన 1964 మే 15న జన్మించారు. రేవా సైనిక్​ స్కూల్​లో స్టడీ పూర్తిచేశారు. 1985 జులై 1న ఇండియన్​ నేవీ ఎగ్జిక్యూటివ్​ విభాగంలో చేశారు. 

కమ్యూనికేషన్​, ఎలక్ట్రానిక్​ వార్​ఫేర్​ ఎక్స్​పర్ట్​గా డీకే త్రిపాఠీకి పేరుంది. వెస్టర్న్​ నావల్​ కమాండ్​కు 
ఫ్లాగ్​ఆఫీసర్​ కమాండింగ్​ ఇన్​ చీఫ్​గా బాధ్యతలు నిర్వర్తించారు. వినాశ్​, కిర్చ్​​, త్రిశూల్​నావల్​ షిప్​లను కమాండ్​ చేసిన అనుభవం ఉన్నది. ప్రఖ్యాత ఇండియన్​ నేవల్​ అకాడమీ, ఎజిమాల కమాండెంట్​గా పనిచేశారు. అతి విశిష్ఠ్‌ సేవా మెడల్‌ (ఏవీఎస్​ఎం), నౌసేన మెడల్‌(ఎన్​ఎం) పురస్కారాలను అందుకున్నారు.